Categories: LEGAL

నిర్మాణం నిలిపివేశాడా?    రెరాలో ఫిర్యాదు చేయాలి!

మీరెంతో ముచ్చ‌ప‌డి కొనుక్కున్న ఫ్లాట్‌ను స‌కాలంలో అప్ప‌గించ‌కుండా.. నిర్మాణ ప‌నుల్ని మ‌ధ్య‌లోనే నిలిపివేసి.. మీ బిల్డ‌ర్ మిమ్మ‌ల్ని వేధిస్తున్నాడా?

ఆరంభంలోనే అంద‌రి వ‌ద్ద సొమ్ము తీసుకుని.. ఆ డ‌బ్బుని వేరే ప్రాజెక్టుల్లోకి మ‌ళ్లించేసి.. బ‌కాయిలు చెల్లిస్తేనే నిర్మాణం పూర్తి చేశాన‌ని హెచ్చ‌రిస్తున్నాడా?

ఒక‌వేళ మీ ప్రాజెక్టు రెరాలో న‌మోదు అయితే, త‌క్ష‌ణ‌మే ఈ స‌మ‌స్య‌ను తెలంగాణ రెరా అథారిటీ దృష్టికి తీసుకెళ్లండి. ఆ ప్ర‌భుత్వ సంస్థే మీ స‌మస్య‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి.. వాస్త‌వ ప‌రిస్థితుల్ని బేరీజు వేసి.. మీకు ప‌రిష్కారం చూపెడుతుంది.

బిల్డ‌ర్లు, రియ‌ల్ట‌ర్ల‌తో ఎదుర‌య్యే ఇలాంటి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకే తెలంగాణ‌లో రెరా అథారిటీ ఏర్పాటైంది. డెవ‌ల‌ప‌ర్ ఎంత పెద్ద వ్య‌క్తి అయినా.. రాజ‌కీయంగా ఎంత ఉన్న‌త‌మైన ప‌రిచ‌యాలు ఉన్న‌ప్ప‌టికీ మీరు బిక్కుబిక్కుమంటూ ఉండ‌న‌క్క‌ర్లేదు. న్యూఢిల్లీలో, కొన్న‌వారికి చుక్క‌లు చూపించిన బ‌డా బిల్డ‌ర్లే జైలుకెళ్లారు. మ‌హారాష్ట్ర‌లోనూ ఆగిపోయిన ప్రాజెక్టును రెరా అథారిటీ పూర్తి చేసింది. అంతెందుకు, యూపీలో కూడా అక్క‌డి అథారిటీ ఇదే విధంగా ప‌ని చేసింది. కాబ‌ట్టి, బిల్డ‌ర్ మీ నిర్మాణం పూర్తి చేయ‌క‌పోతే ప‌రిస్థితి మ‌రింత జ‌ఠిలం అవుతుంద‌ని అపోహ ప‌డొద్దు. మీ బిల్డ‌రుతో ఇబ్బందులు ప‌డుతుంటే వెంట‌నే మాస‌బ్ ట్యాంకులో గ‌ల తెలంగాణ రెరా అథారిటీని సంప్ర‌దించి మీ ఫిర్యాదును అంద‌జేయండి. మీ స‌మ‌స్య త‌ప్ప‌కుండా ప‌రిష్కారం అవుతుంది.

మాదాపూర్‌లో ఒక సంస్థ ఇదే విధంగా.. ఐదేళ్ల క్రితం ఆరంభించిన ప్రాజెక్టును నేటికీ పూర్తి చేయ‌లేదు. ప‌దో అంత‌స్తు వ‌ద్ద నిర్మాణాన్ని బిల్డ‌ర్ నిలిపివేశాడు. ఏడాది నుంచి అతీగ‌తీ లేదు. కంట్రాక్టరుకు రూ.6 కోట్లు చెల్లించ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని స‌మాచారం. ఆ సొమ్మును ఏదో ర‌కంగా చెల్లించాల‌ని అందులోని బ‌య్య‌ర్లు భావించారు. తాము సంస్థ‌కు చెల్లించాల్సిన సొమ్మును నేరుగా కంట్రాక్ట‌రుకు చెల్లించేందుకు సంసిద్ధుల‌య్యారు. కాక‌పోతే, మిగ‌తా ఒక ట‌వ‌ర్ ఎలా పూర్తి చేస్తారు? ప్ర‌స్తుత‌మున్న నిలిచిపోయిన ప‌ది అంత‌స్తుల పైన మ‌రో రెండు అంత‌స్తులు ఎప్పుడు వేస్తారు? సానిట‌రీ, హార్డ్‌వేర్‌, ఫ్లోరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ప్లాస్ట‌రింగ్‌, ల‌ప్పం వంటి ప‌నులు చేయ‌డానికి ఇంకెంత సొమ్ము కావాలోన‌ని వీరంతా ఆలోచిస్తున్నారు. మ‌రి, ఆ సొమ్మును లెక్కిస్తే ఎంత‌లేద‌న్నా కోట్లు దాటుతోంది. మ‌రి, స‌ద‌రు డెవ‌ల‌ప‌ర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాడా? లేదా? అనే సందేహం ప్ర‌తిఒక్క‌ర్ని ప‌ట్టిపీడిస్తోంది. ఇలా, సుమారు మూడు వంద‌ల మంది కొనుగోలుదారులు ఆయా బిల్డ‌ర్ వ‌ద్ద 2017లో కొని.. నేటికీ ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారు. మ‌రి, ఇలాంటి బిల్డ‌ర్ల‌ను దారిలోకి తేవాలంటే రెరా అథారిటీకి ఫిర్యాదు చేయ‌డ‌మే మార్గ‌మ‌నే విష‌యాన్ని ప్ర‌తిఒక్క‌రూ గుర్తుంచుకోవాలి.  మీరేమాత్రం ఆలోచిస్తూ కూర్చున్నా.. బిల్డ‌ర్ మ‌రికొంత కాలం ఆల‌స్యం చేసే ప్రమాదం లేక‌పోలేదు. కాబ‌ట్టి, ఇలాంటి వ్య‌వ‌హారాల్లో.. ఆల‌స్యం అమృతం విషం అని గుర్తుంచుకోండి.

This website uses cookies.