Categories: LATEST UPDATES

రెరాపై లోకాయుక్తకు ఫిర్యాదు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఓ కొనుగోలుదారు కర్ణాటక రెరాపై ఆ రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కే రెరా కార్యదర్శితోపాటు హౌసింగ్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రటరీపై కర్ణాటక రియల్ హోమ్ బయ్యర్స్ ఫోరమ్ అండ్ బెంగళూరు సిటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శైలేష్ చారాటి ఫిర్యాదు చేశారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ఆదేశాలు ఇస్తున్నారని.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

ఆర్య గృహ ప్రైవేటు లిమిటెడ్ పై తాను ఇచ్చిన ఫిర్యాదును అసలు పట్టించుకోకుండా పార్టీల మధ్య సమస్య పరిష్కారమైపోయిందని చెప్పి ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. కేసు నడుస్తున్నప్పటికీ, కేసు ముగిసిపోయినట్టుగా పేర్కొన్నారని మండిపడ్డారు. ఇళ్ల కొనుగోలుదారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కర్ణాటక రెరాను ఏర్పాటు చేశారని, కానీ ఆ సంస్థ సహాయం చేయడం మానేసి, తప్పుడు ఆదేశాలిస్తోందని విమర్శించారు. పైగా వీటి గురించి తాను ప్రత్యేకంగా తెలియజేసినప్పటికీ, తన తప్పును సరిదిద్దుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెరా చట్టానికి విరుద్ధంగా తప్పుడు ఆదేశాలిస్తున్న చైర్మన్ కిషోర్ చంద్రను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రెరా చట్ట ఉద్దేశం నెరవేరదన్నారు. ఇళ్ల కొనుగోలుదారుల సంక్షేమం కోసం కే రెరా పనిచేయడంలేదని.. ఇతర రాష్ట్రాల రెరాలు పని చేసినట్టుగా కర్ణాటక రెరా పని చేయడంలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరారు.

This website uses cookies.