దేశంలోని రియల్టీ రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల జోరు తగ్గింది. 2023 తొలి ఆరునెలల్లో పీఈ పెట్టుబడులు 20 శాతం మేర తగ్గి 2.58 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది. ఆఫీస్, వేర్ హౌసింగ్, రెసిడెన్షియల్ విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఈ పెట్టుబడులు వచ్చినట్టు వివరించింది. 2022 తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇన్వెస్టర్లు పెట్టుబడి వ్యూహాలు మార్చినట్టు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలతో ఈ ఏడాది ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరించడంతో ఈ క్షీణత కనిపించినట్టు వెల్లడించింది. అయితే, ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఇది పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తమ్మీద ఈ ఏడాది రియల్ రంగంలో పీఈ పెట్టుబడులు5.3 శాతం వార్షిక వృద్ధితో 5.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది. కాగా, ఇప్పటివరకు వచ్చిన మొత్తం పీఈ పెట్టుబడుల్లో 68 శాతం వాటాతో ఆఫీస్ రంగం మొదటి స్థానంలో ఉందని తెలిపింది. తర్వాత 21 శాతంతో వేర్ హౌసింగ్, 11 శాతం వాటాతో రెసిడెన్షియల్ విభాగాలు ఉన్నట్టు వెల్లడించింది.
This website uses cookies.