Categories: LATEST UPDATES

రూ.2700 కోట్ల రుణం కోసం ఢిల్లీ మెట్రో కసరత్తు

15 సంవత్సరాల కాలవ్యవధితో రూ.2700 కోట్ల రుణం ఇవ్వడం కోసం 18 పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) బిడ్లు ఆహ్వానించింది. ‘ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ అసెట్స్’ కొనుగోలు కోసం ఈ రుణం అవసరం అని పేర్కొంటూ ఆయా బ్యాంకులకు లేఖలు రాసింది. ఈ రుణం ఇచ్చేందుకు బిడ్ దాఖలు చేయాలని కోరింది. ఈ మొత్తాన్ని రిలయెన్స్ ఇన్ ఫ్రా సబ్సిడరీ కంపెనీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్) కు చెల్లించనుంది. రూ.4,600 కోట్ల ఆర్బిట్రల్ అవార్డు మొత్తాన్ని వడ్డీతో సహా రెండు వాయిదాల్లో డీఏఎంఈపీఎల్ కు చెల్లించాలంటూ డీఎంఆర్సీకి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 10న సమర్థించింది.

ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ కి సంబంధించిన సివిల్ పనులను చేయడం కోసం డీఎంఆర్సీ, డీఎఎంఈపీఎల్ లు 2008 ఆగస్టులో ఒప్పందం చేసుకున్నాయి. అయితే, డిజైన్, నాణ్యతాపరమైన కారణాలతో 2012లో ఒప్పందం రద్దు చేయాలంటూ డీఏఎంఈపీల్ నోటీసిచ్చింది. దీంతో డీఎంఆర్సీ ఆ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. అయితే, కోవిడ్ కారణంగా విపరీతమైన నష్టాలు రావడంతో డీఎంఆర్సీ ఆర్థికపరమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నెలల్లో డ్రా చేసుకునేలా, రుణ కాలవ్యవధి నాలుగేళ్ల మారటోరియంతో 15 ఏళ్లు ఉండేలా చూడాలని డీఎంఆర్సీ భావిస్తోంది. నాలుగేళ్ల మారటోరియం తర్వాత నెలనెలా వడ్డీ, మూడు నెలలకు ఓసారి అసలు చెల్లించాలని యోచిస్తోంది.

This website uses cookies.