జీరో వ్యర్థాలను ఉత్పత్తి చేసే హరిత భవనాలకు ఆస్తి పన్నులో ఒక శాతం రాయితీ ఇస్తామని నాసిక్ మున్సిపల్ కమిషనర్ కైలాస్ జాదవ్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కంపోస్ట్ లేదా బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న హౌసింగ్ సొసైటీలు ఈ రాయితీ పొందుతాయని వివరించారు. ‘చెత్త, వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయడానికి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే, ఆయా భవనాల నుంచి చెత్తను సేకరించే పని మాకు తప్పుతుంది.
చెత్త నుంచి తయారు చేసిన కంపోస్టును తోటలు, నర్సరీలు, టెర్రస్ గార్డెన్లలో వినియోగించవచ్చు’ అని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ ప్రాతిపాదనను ఆమోదం కోసం కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం నాసిక్ లో చెత్ల సేకరణ వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు.
ఇలా రోజుకు 262 వాహనాల ద్వారా దాదాపు 600 మెట్రికల్ టన్నుల చెత్తలను సేకరించి నగర శివార్లలో ఉన్న పథార్థి ప్లాంటుకు తరలిస్తున్నారు. ‘ప్లాంటుపై భారం తగ్గించాలని భావిస్తున్నాం. హౌసింగ్ సొసైటీలు తమ ప్రాంగణంలోనే ఈ వ్యర్థాలను కంపోస్టుగా మారిస్తే చెత్త సేకరణ భారం చాలా వరకు తగ్గుతుంది’ అని ఓ అధికారి వివరించారు. కాగా, ఇప్పటికే సోలార్ వాటర్ హీటర్లు వినియోగిస్తున్నవారికి ఆస్తి పన్నులో ఒక శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
This website uses cookies.