Categories: LEGAL

సూపర్ టెక్ కేసులో బయ్యర్ల పిటిషన్ కొట్టివేత

రియల్ ఎస్టేట్ డెవలపర్ తమ ఫ్లాట్లు అప్పగించేంత వరకు ఈఎంఐలను వసూలు చేయొద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలివ్వాలని కోరుతూ పలువురు కొనుగోలుదారులు వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కొనుగోలుదారులకు వినియోగదారుల రక్షణ చట్టం, దివాలా చట్టం, రెరా వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ రిటి పిటిషన్లను అంగీకరించలేమని న్యాయమూర్తి జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ స్పష్టంచేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఇళ్ల కొనుగోలుదారులతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను అనుసరించినట్టయితే చట్టానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయం వెలువడుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

123 మందితో కూడిన సూపర్ టెక్ అర్బన్ హోమ్ బయ్యర్స్ అసోసియేషన్ సహా పలువురు వ్యక్తులు సబ్ వెన్షన్ పథకం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి గృహరుణాలు తీసుకున్నారు. ఈ పథకం కింద మంజూరైన రుణ మొత్తాన్ని నేరుగా బిల్డర్ కు జమ చేశారు. ప్రీ ఈఎంఐ లేదా పూర్తి ఈఎంఐ చెల్లించే బాధ్యత బిల్డర్ దే. అయితే, ఈ వ్యవహారంలో బిల్డర్ తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేదు. అలాగే ఫ్లాట్లను అప్పగించలేదు.

అయితే, బ్యాంకులు మాత్రం తమ ఈఎంఐలు చెల్లించాలని రుణ గ్రహీతలను డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వారంతా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేమని స్పష్టంచేశారు. ఇదంతా పూర్తిగా ఒప్పంద సంబంధమైన కేసు అని, వీటకి సంబంధించిన విచారణలు ఇప్పటికే ఇతర ట్రిబ్యునళ్ల ముందు ఉన్నాయని పేర్కొన్నారు. రెరా చట్టంతోపాటు వినియోగదారుల రక్షణ చట్టం, దివాలా చట్టం వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నందున.. పిటిషనర్లు అక్కడ ఫిర్యాదు చేయడం ద్వారా వీటిని పరిష్కరించుకోవడం ఉత్తమం అని వ్యాఖ్యానించారు. ఈ దశలో ఇలాంటి రిట్ పిటిషన్లను స్వీకరించడం సబబు కాదని పేర్కొంటూ పిటిషన్ ను తోసిపుచ్చారు.

This website uses cookies.