సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ను సైతం లెక్క చేయని బిల్డర్ పై బాంబే హైకోర్టు కన్నెర్ర చేసింది. నోయిడా జంట టవర్లకు ఎదురైన పరిస్థితిని మీరూ కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ముంబై సబర్బన్ ఖర్ లో ఆటస్థలం కోసం నిర్దేశించిన భూమిలో ఓ బిల్డర్ అక్రమంగా నిర్మాణం చేపట్డాడు. దీనిపై 1995లో సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇటీవల సదరు బిల్డర్ నిర్మాణాన్ని కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనిపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్ తో కూడిన ధర్మాసనం గతవారం విచారణ చేపట్టి, నిర్మాణ స్థలంలో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియజేయాలని ఓ ఆర్కిటెక్టును ఆదేశించింది. దీనిపై పరిశీలన జరిపిన ఆర్కిటెక్టు.. సుప్రీం స్టే తర్వాత నిర్మాణాలు జరిగిన విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు నివేదిక సమర్పించారు. అయితే, భూమికి సంబంధించిన అభ్యంతరాలు తొలగిపోయినందును స్టే ఎత్తేవేయాల్సి ఉందని బిల్డర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనికి హైకోర్టు నిరాకరిస్తూ.. మనం వేచి చూద్దామని.. మీరు సూపర్ టెక్ ఎదుర్కొన్న పరిస్థితిని కావాలనుకుంటున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
This website uses cookies.