Categories: TOP STORIES

షార్ట్‌ఫాల్ డాక్యుమెంట్ల‌ను వెంట‌నే అప్లోడ్ చేయాలి!

రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో.. 2020 ఆగ‌స్టు 26 కంటే ముందు రిజిస్ట‌ర్ అయిన అనుమ‌తి లేని, చ‌ట్ట‌విరుద్ధ‌మైన లేఅవుట్ల‌ను, ప్లాట్ల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నిబంధనలు 2020లో విడుదల చేసినప్పటికీ, ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తుల ప్రాసెసింగ్ 2024 జనవరిలో ప్రారంభమైంది. ఇప్పటివరకు, 4,28,832 దరఖాస్తులు ప్రాసెస్ చేశారు. అందులో 60,213 దరఖాస్తుల్ని ఆమోదించారు. ఈ క్ర‌మంలో రూ.96.60 కోట్లు వసూలైంది.

అయితే, దాదాపు 75% దరఖాస్తులలో పూర్తి స్థాయి డాక్యుమెంట్లు సమర్పించక షార్ట్‌ఫాల్స్‌తో ఉండటం వ‌ల్ల‌.. వాటిని అప్‌లోడ్ చేయ‌డానికి దరఖాస్తుదారులకు స‌మాచారం అంద‌జేశారు. దీనివల్ల దరఖాస్తులు సమయానికి ప్రాసెస్ జ‌ర‌గ‌లేదు. ఈ ప్ర‌క్రియ‌ వేగవంతం అవ్వ‌డానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుండి అధికారిక షార్ట్‌ఫాల్స్ లెట‌ర్ల కోసం వేచి చూడకుండా.. పూర్తి స్థాయి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం కల్పించారు.

ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయని దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సేల్ డీడ్, ఈసి, మార్కెట్ విలువ సర్టిఫికెట్ మరియు లేఔట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు.

ఫ‌లితంగా ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తులు సమయానికి ప్రాసెస్ చేస్తారు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ OTP వినియోగించుకుని సవరించుకోవచ్చు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృధి సంస్థలు మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఏమైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరణల కోసం ఈ హెల్ప్ డెస్కులను సందర్శించవచ్చు.

This website uses cookies.