Categories: LATEST UPDATES

అప్పు తెచ్చి అసలే కొనవద్దు

రెజ్ న్యూస్, హైదరాబాద్: హైద‌రాబాద్ మార్కెట్ అభివృద్ది చెందుతుంద‌ని.. ఈరోజు పెట్టుబ‌డి పెడితే రెండు, మూడు నెల‌ల్లో రేటు పెరుగుతుంద‌ని అనుకుంటే ఎట్టి ప‌రిస్థితిలో న‌మ్మొద్దు. న‌గ‌ర రియ‌ల్ రంగంలో నెల‌కొన్న వాస్త‌వ ప‌రిస్థితుల్ని క్షుణ్నంగా ప‌రిశీలిస్తే.. అనేక వాస్త‌వాలు అర్థ‌మ‌వుతాయి. ప్లాట్ల ధ‌ర‌లు పెరుగ‌తాయ‌నే ఉద్దేశ్యంతో.. అప్పు తెచ్చి అస్స‌లు పెట్టుబ‌డి పెట్టొద్దు.

కొంతకాలం క్రితం.. హైద్రాబాద్లో విమానాశ్రయం ఏర్పాటవుతుందనే వార్త కొన్ని ప్రాంతాల్లో షికారు చేసింది. ముందుగా కరీంనగర్ రోడ్డులో వస్తుందన్నారు. తర్వాత దుండిగల్ విమానాశ్రయం పక్కనే అన్నారు. పటాన్ చెరు వద్ద ఇక్రిశాట్.. ఆ తర్వాత కీసర.. ఇలా పుకార్లు వ్యాపించిన ప్రాంతాల్లో భూముల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి. ఆ త‌ర్వాత త‌గ్గి ఒక రేటు వ‌ద్ద స్థిర‌ప‌డింది.
మాదాపూర్లోని హైటెక్ సిటీ…ఆరంభమైంది 1995లో అప్పట్లో గజం ధర వెయ్యి రూపాయ‌ల్లోపే ఉండేది. దాదాపు ఏడేళ్లకూ ఇంచుమించు రూ.2000కు చేరింది. 2003లో సంస్థలొచ్చాకే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు రావడం మొదలైంది. ఇతర వ్యాపారాలు జోరందుకున్నాయి. ఇక అప్పట్నుంచి స్థలం ధర పెరుగుతూ 2008 నాటికి గజం రేటు రూ.50,000.. ఇప్పుడేమో ల‌క్ష అయ్యింది.
మహేశ్వరంలో 1997లో ఎకరం ధర రూ లక్ష లేక లక్షన్నర ఉండేది. 2005లో బూమ్ ఏర్పడింది. కార్లలో సొమ్ము పెట్టుకుని భూములు కొనడానికి తిరిగేవారు. అగ్రిమెంట్ల మీద ఒప్పందాలు జరిగేవి. ఈ క్రమంలో ఎకరం ధర రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలు పలికింది. వందలాది లే అవుట్లు వెలిశాయి. గజం వెయ్యి రూపాయ‌లున్న రేటు ఏడు వేలకు చేరుకుంది. ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం 16-20 వేలు అయ్యింది.

అలా ప్లాటు కొన‌గానే ఇలా రేటు పెరుగుతుంద‌ని ఎవ‌రైనా చెబితే అస్స‌లు న‌మ్మొద్దు. అప్పులు తెచ్చి స్థలాలపై పెట్టుబడులు పెట్టొద్దు. అవకాశముంటే సొంత నిధులతో కొనుగోలు చేయాలి. అది కూడా వేచి చూసే ఓపిక ఉంటేనే తీసుకోవాలి. అగ్రిమెంట్ల మీద స్థలాల్ని అసలే తీసుకోకూడదు. ఐదారు అగ్రిమెంట్లు చేతులు మారిన తర్వాత…రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇలాంటి వివాదాలు నగరంలో ఎక్కువే ఉన్నాయ‌ని మర్చిపోవ‌ద్దు. బూమ్ లో ధరలు ఉవ్వెత్తున ఎగసిపడటం…ఆ తర్వాత స్థిరపడటం సర్వసాధారణమే. అప్పుడే ఆయా భూముల అసలు ధరలు అందరికీ తెలుస్తాయి. కాబ‌ట్టి, ప్లాట్ల‌లో పెట్టుబ‌డి పెట్టేవారు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.

This website uses cookies.