కింగ్ జాన్సన్ కొయ్యడ : ప్రతి అపార్టుమెంట్‌లో కొందరు వ్యక్తులుంటారు.. మేనేజింగ్ కమిటీ ఎంత మంచి పని చేసినా, అందులో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు. సాటి నివాసితుల్లో విషబీజాల్ని నాటుతుంటారు. నిర్వహణ సంఘం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కమిటీ సభ్యులు ముందు ఒక మాట.. వెనక మరో మాట మాట్లాడతారు. పోనీ వీరేమైనా కమిటీ రోజువారి పనుల్లో సాయం చేస్తారా? అంటే అదీ లేదు. ఇలాంటి వారి వల్ల కమ్యూనిటీ రెండు లేదా మూడు వర్గాలుగా చీలిపోయే ప్రమాదముంది. హైదరాబాద్‌లోని అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి, ఇలాంటి వారిని ముందే గుర్తించి.. పక్కన పెట్టేయడం ఉత్తమం.
కొన్ని గేటెడ్ కమ్యూనిటీలను చూస్తే ముచ్చటేస్తుంది. ఎప్పుడు చూసినా నిత్యనూతనంగా కళకళలాడుతాయి. నిర్వహణ విషయంలో మెరుగ్గా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమవుతుంది. మరి కొన్నేమో అందవికారంగా దర్శనమిస్తాయి. నిర్వాహణకు సంబంధించి నిర్లక్ష్యం వహించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఆయా ఫ్లాట్ల విలువ గణనీయంగా పడిపోతుంది. అలా కాకూడదంటే, నివాసితులంతా వ్యక్తిగత వివాదాల్ని పక్కనపెట్టి… అహంభావాలకు తావివ్వకుండా.. ఒకే మాట మీద నిలబడి అపార్టుమెంటును సక్రమంగా నిర్వహించడం మీద దృష్టి సారించాలి. ఇందుకోసం పటిష్టమైన నియమ నిబంధనల్ని(బైలాస్) రూపొందించుకోవాలి.
నగరంలో నిర్మాణం పూర్తైన లగ్జరీ ఫ్లాట్లు, ఆకాశహర్మ్యాలు, ఆధునిక విల్లాలు…ఇందులో నివసించే ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.. ఒక్కో ప్రాంతం.. విద్యాబుద్ధులు, వేష బాషలు, ఆలోచన విధానం, నిర్ణయం తీసుకునే మనస్తత్వం.. ఇలా ప్రతి అంశంలోనూ తేడా స్పష్టంగా కన్పిస్తుంది. ఒక్కో నిర్మాణం మినీ భారత్ ను తలపిస్తున్న నేపథ్యంలో.. కమ్యూనిటీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ప్రయత్నించాలి. ఎవరికి వారే తమకెందుకులే అని భావించినా.. తీరిక లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. నష్టం అందరి మీద పడుతుంది. అపార్టుమెంటు కళావిహీనంగా తయారవుతుంది. కాబట్టి, సంఘం నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని బైలాస్‌లో పక్కాగా రాసుకోవాలి.
అపార్టుమెంటు నిర్మాణం పూర్తైన తర్వాత.. లేదా పూర్తి అయ్యే తరుణంలో..నివాసితులంతా కలిసి నివాస సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బిల్డరే ఇందుకు చొరవ తీసుకోవాలి. లేకపోతే నివాసితులు కలిసి ఒక జట్టుగా ఏర్పడాలి. నిర్మాణ పటిష్టత, భద్రతా నిర్వహణకు సంబంధించి లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రెరా నిబంధనల కింద వచ్చే కొత్త అపార్టుమెంట్ల నిర్వహణ బాధ్యత ఐదేళ్ల దాకా బిల్డరు మీదే ఉంటుంది. కాబట్టి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెరా పరిధిలోకి రాని అపార్టుమెంట్లతోనే సమస్య వస్తుంది. ఫ్లాట్ల సంఖ్యను బట్టి సంఘంలో ఎంతమంది సభ్యులుండాలనే విషయంలో ముందుగా స్పష్టత రావాలి. యాభై కంటే తక్కువ ఫ్లాట్లు..అది కూడా ఒకే బ్లాకు మాదిరిగా ఉండే సంఘంలో ఐదారుగురు కీలక సభ్యులుండొచ్చు. కాకపోతే బిల్డర్లు, పలు నిర్మాణాల్ని టవర్లు లేదా బ్లాకుల మాదిరిగా నిర్మించారు. ఒక్కో బ్లాకు నుంచి సంఘంలో ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొనుగోలుదారుల నుంచి బిల్డర్/ డెవలపర్ ముందే కార్పస్ ఫండ్ వసూలు చేస్తాడు. ఏ సంఘమైనా నిర్వహణలో ఇబ్బందులు ఎదురు కావొద్దంటే, కార్పస్ ఫండ్ ను దేనికోసం వినియోగించాలి. ఏయే అవసరాలకు వాడకూడదనే అంశంలో స్పష్టంగా రాతకోతలుండాలి. ఈ అంశంలో నగరానికి చెందిన పలు నివాస సంఘాలు చాలా స్పష్టంగ నిబంధనల్ని రాసుకోవాలి. ఈ సొమ్మును ఎన్నేళ్ల పాటు బ్యాంకులో కదలకుండా ఉంచాలి? ఒకవేళ తీయాల్సి వస్తే.. ఏయే సందర్భాల్లో ఆయా సొమ్మును వినియోగించాలి? వంటి విషయాల్ని స్పష్టంగా రాసుకోవాలి.
This website uses cookies.