Categories: HOME LOANS

ఫ్లాటే బెస్ట్ ఆప్ష‌న్‌

పెట్టుబ‌డి సాధ‌నాల్లో అన్నింటి కంటే ఫ్లాట్ మీదే అత్య‌ధిక రాబ‌డి గిట్టుబాటు అవుతుంద‌నే విష‌యం మీకు తెలుసా? ఔనా.. అదెలా? అని అనుకుంటున్నారా? మీరు అంగీక‌రించినా.. అంగీక‌రించ‌కున్నా.. ఇది ముమ్మాటికి నిజం.

పెట్టుబడుల గురించి ఆలోచిస్తే బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్సడ్ డిపాజిట్లు వంటి సాధనాలు ఎవరికైనా గుర్తుకొస్తాయి. అయితే, అన్నింటి కంటే ఉత్తమమైనది.. అధిక ఆదాయం తెచ్చేది ఫ్లాట్ మాత్రమే. చాలామంది ఫ్లాట్ కంటే ప్లాటు కొంటే ఉత్తమమని వాదిస్తుంటారు. కానీ, వాస్తవికంగా ఆలోచిస్తే ఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టడమే సరైన నిర్ణయం. ఎలాగంటే, ఓ చిన్న సైజు ఫ్లాట్ విలువ రూ.40 లక్షలనుకోండి.. దానిపై ఆరంభంలో మనం పెట్టే పెట్టుబడి ఎనిమిది లక్షలే. అంటే ఇరవై శాతమే. మిగతా 32 లక్షలను బ్యాంకు రుణమిస్తుంది. పైగా, దానిని తీర్చడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు తీసుకుంటాం. వడ్డీ శాతం కూడా ఏడు శాతానికి అటుఇటుగా ఉంది.

మన దేశంలో ద్రవ్యోల్బణం సుమారు ఆరు శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వడ్డీ రేటు ఏడు శాతముంటే, అందులో నుంచి ఆరు శాతాన్ని మినహాయిస్తే.. మొదటి ఏడాది మనం చెల్లించేది కేవలం ఒక‌ శాతమే. మరుసటి ఏడాది కూడా అదే ద్రవ్యోల్బణముంటే.. మనం కట్టే వడ్డీ మైనస్ అవుతుంది. 32 లక్షల రుణంపై నెలకు మహా అయితే 24 వేల వరకూ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే, ఇంటిని అద్దెకు ఇచ్చామనుకోండి.. నెలకు ప‌ది వేల వరకూ అద్దె గిట్టుబాటవుతుంది. పైగా ఆదాయ పన్ను రాయితీ ఉంటుంది. ఈ రెండింటినీ లెక్కిస్తే.. మ‌నం జేబులో నుంచి పెట్టేది పెద్ద‌గా ఉండ‌దు. కొన్నాళ్ల త‌ర్వాత ఇంటి రుణం ఇల్లే తీర్చేస్తుంది.

ఇల్లు ఎంతకు కొన్నారని ఎవరైనా ప్రశ్నిస్తే.. చాలామంది న‌ల‌భై లక్షలు పెట్టి కొన్నామని అంటుంటారు. నిజానికి, వారు జేబులో నుంచి పెట్టేది కేవలం ఇరవై శాతమే. మిగతాది బ్యాంకే కడుతుంది. కాబట్టి, అధిక ఆదాయం కావాలని కోరుకునేవారు.. తప్పనిసరిగా ఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టడమే అన్ని విధాల నయం. ఉదాహరణకు, 1994లో మియాపూర్లో ఒక 600 చదరపు అడుగుల ప్లాట్ ని జ‌న‌ప్రియ సంస్థ‌ రూ.1.18 లక్షలకే విక్రయించింది. అందులో కొనుగోలుదారులు ఆరంభంలో తమ జేబులో నుంచి పెట్టింది కేవలం పద్దెనిమిది వేలే. మిగతాది బ్యాంకు రుణం మంజూరైంది. ప్రతినెలా బ్యాంకుకు కట్టిన నెలసరి వాయిదా కూడా కేవలం పద్దెనిమిది వందలే. అంటే, ఇంటి అద్దె కంటే తక్కువ అన్నమాట. ఆ విధంగా, ఇంటి రుణం ఇల్లే తీర్చేసింది. ప్రస్తుతం ఆ ఫ్లాట్ విలువ ఎంతలేదన్నా ఇర‌వై ల‌క్ష‌లు దాటేసింది. అంటే, వారు పెట్టిన పెట్టుబడితో పోల్చితే రేటు దాదాపు అనేక రెట్లు పెరిగింది. ఫ్లాట్ విలువ ఇరవై లక్షలైనా.. ముప్పయ్ లక్షలైనా.. పెరుగుదల మాత్రం కచ్చితంగా ఉంటుంది. పెట్టుబడులను షేర్లు, ఫండ్లలో పెడితే హెచ్చుతగ్గులకు చాన్స్ ఉంటుంది. కానీ, ఫ్లాట్లలో పెడితే రేటు పెరగడమే తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి, రుణసాయంతో ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టడమే అన్నివిధాల ఉత్తమమం అని గుర్తుంచుకోండి.

This website uses cookies.