Categories: LATEST UPDATES

పెట్టుబడుల ప్రవాహం

  • ఈ ఏడాది క్యూ1లో రెట్టింపు పెట్టుబడులు
  • కొల్లియర్స్ కంపెనీ నివేదికలో వెల్లడి

భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి సంస్థాగతమైన పెట్టుబడులు వరదలా పారుతున్నాయని.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అవి 1.1 బిలియన్ డాలర్లను చేరుకున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల కంపెనీ కొల్లియర్స్ పేర్కొంది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తమని వివరించింది. కోవిడ్ మూడో వేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో రియల్ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం పోటెత్తిందని తెలిపింది.

2021 తొలి త్రైమాసికంలో 0.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉండగా.. ఆ ఏడాది చివరి త్రైమాసికంలో అది ఒక బిలియన్ డాలర్లకు చేరిందని వెల్లడించింది. ఈ ఏడాది తొలి క్వార్టర్ లో అది మరింతగా పెరిగి 1.1 బిలియన్ డాలర్లకు చేరిందని వివరించింది. ఇందులో దాదాపు 70 శాతం వరకు విదేశీ పెట్టుబడులే ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో దేశీయ పెట్టుబడులు 30 శాతానికి పెరిగాయని.. ఇది దాదాపుగా కరోనా ముందు ఉన్నదాంతో సమానమని విశ్లేషించింది.

దేశీయ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని కొల్లియర్స్ పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం తొలి క్వార్టర్ లో ఆఫీస్, రిటైల్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ 95 శాతం వాటాతో టాప్-3లో ఉన్నాయని తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ లో ఆఫీస్, ప్రత్యామ్నాయాలు, రెసిడెన్షియల్ విభాగాలు 99 శాతం షేర్ తో టాప్-3లో ఉన్నట్టు వివరించింది.

మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం వాటాతో ముంబై మొదటి స్థానంలో కొనసాగుతోందని కొల్లియర్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ సర్వీసెస్ ఎండీ పీయూష్ గుప్తా వెల్లడించారు. ప్రభుత్వ అనుకూల విధానాల కారణంగా ఇటు దేశీయ, అటు గ్లోబల్ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

This website uses cookies.