హైదరాబాద్లో ఫ్లాట్ల ధరలెక్కువగా ఉండటంతో సామాన్యులు కొనుక్కోలేని దుస్థితి ఏర్పడింది. కారణం.. భారీగా పెరిగిన భూముల ధరలే. సందిట్లో సడేమియాలా కొందరు అక్రమార్కులు రియల్ రంగంలోకి ప్రవేశించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను ఆసరాగా చేసుకుని.. రేటు తక్కువంటూ యూడీఎస్, ప్రీలాంచ్‌లో అమ్మకాలు మొదలెట్టారు. ఈ దురాగతాల్ని అరికట్టాలని.. నిర్మాణ సంఘాలు నెత్తీనోరు మొత్తుకుంటున్నా.. తెలంగాణ రెరా అథారిటీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇదే అదనుగా భావించి కొందరు అక్రమార్కులు ఎలా బరితెగిస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
కొల్లూరులో ఒక రైతుకి ఐదెకరాల పొలం ఉంది. దాన్ని పక్కనే ఉన్న 5 ఎకరాల స్థలానికి ఒక యూడీఎస్ డెవలపర్ కొంత అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు. పనిలో పనిగా ఈ ఐదెకరాల మీద అతని కన్ను పడింది. భూమిని అమ్మమంటే.. తర్వాత చూద్దాం అని తన భూమిని ఇవ్వడానికి అంగీకరించలేదా రైతు. కాకపోతే, ఓ మిత్రుడి ద్వారా నిర్ఘాంతపోయే వార్త తెలిసింది. సదరు యూడీఎస్ సంస్థ తన భూమిని కూడా అమ్మకానికి పెట్టారని తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
ఇక్కడే కాస్త తెలివిగా ఆలోచించి ఆయా సంస్థ వద్దకు బయ్యర్‌గా వెళ్లాడు. అక్కడి ఎగ్జిక్యూటివ్ ఆ ఐదెకరాలు కూడా తమదేనని.. ఇప్పటికే స్థల యజమానికి అడ్వాన్సు కూడా ఇచ్చామని చెప్పడం విని ఆశ్చర్యపోయాడు. రెండు, మూడు వారాల్లో మొత్తం సొమ్ము ఇచ్చి స్థలాన్ని సొంతం చేసుకుంటామని ఆ ఎగ్జిక్యూటివ్ చెబుతుంటే కోపాన్ని అతి కష్టంగా దిగమింగుకున్నాడు. ఇంకా ఎంతెంత మంది ఆయా పొలాన్ని కొన్నారో చెబితే.. వాళ్లతో మాట్లాడాక.. నమ్మకం కుదిరితే.. తాను ప్లాటు కొంటానని రైతు బెట్టు చేశాడు. దీంతో ఎగ్జిక్యూటివ్ ఎంతో ఉత్సాహంతో ఇద్దరు కొనుగోలుదారుల నెంబర్లను ఇచ్చాడు.
అందులో ఒకతను పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ అట.. రూ.20 లక్షలిచ్చానని చెప్పాడు. మరొక వ్యక్తి అయిన ప్రభుత్వ ఉద్యోగికి ఏకంగా అగ్రిమెంట్ కూడా రాసిచ్చేశారీ స్కామ్ స్టర్లు. ‘‘చాలా తక్కువకు వచ్చింది సార్.. మంచి కంపెనీ సార్.. బల్క్ బుకింగ్స్ చేశాం.. కొల్లూరులో అంత రేటుకు ఎక్కడొస్తుంది సార్’’ అంటూ వాళ్లు చెప్పే మాటలు వింటుంటే సదరు రైతుకు పాపం అనిపించింది. పట్టపగలు ఇంత దర్జాగా దోపిడి చేస్తుంటే షాక్ అనిపించిందని సదరు రైతు రియల్ ఎస్టేట్ గురుతో తమ అనుభవాన్ని పంచుకున్నారు.
This website uses cookies.