హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టాలని భావించేవారు.. నగరంలోని సుమారు ఎనిమిది కారిడార్లను పరిశీలించవచ్చు. ఇందులో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్టుతో పాటు ఫైనాన్షియల్ కారిడార్ కీలకమైనది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు వంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. మరి, మిగతా కారిడార్ల గురించి మీకు తెలుసా?
ఎయిరోస్పేస్ కారిడార్.. అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, వండర్‌లా, మంగళపల్లి ప్రాంతం దీన్ని పరిధిలోకి వస్తుంది. రామోజీ ఫిలింసిటీ, లాజిస్టిక్స్ హబ్ వంటివి ఇందులోకి వస్తాయి. ఇటీవల ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్: శంషాబాద్, కొత్తూరు, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాలు. వచ్చే పదేళ్లలో పెరిగాల్సిన రేట్లను ఇప్పుడే పెంచేశారు. కాబట్టి, ధరలు తగ్గేంత వరకూ ఎదురు చూసి కొనడమే ఉత్తమం.
హైదరాబాద్ నాగపూర్ ఐటీ కారిడార్: మేడ్చల్, మేడ్చల్ రోడ్డు, దూలపల్లి, బహుదూర్ పల్లి. ప్రస్తుతం ఎంతోకొంత అందుబాటు ధరలో ప్లాట్లు ఉన్న ప్రాంతం. ఇక్కడ కొంటే ఎలాంటి ఢోకా ఉండదు. నివసించేందుకు ఇవి మంచి ప్రాంతాలు.
పటాన్‌చెరు ఇండస్ట్రీయల్ కారిడార్: మియాపూర్, ఇస్నాపూర్, రుద్రారం, సంగారెడ్డి, సదాశివపేట్. నగరానికి చేరువలో ఉండటం కలిసొచ్చే అంశం. కాకపోతే, కొన్ని ప్రాంతాల్లో ధరలు అందుబాటులో లేవు. సదాశివపేట్‌లో కూడా ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటాయి. అక్కడ కొనకపోవడమే అన్నివిధాల మంచిది. లేకపోతే మహేశ్వరంలో ఎదురైన అనుభవమే ఇక్కడా పునరావృతం కావొచ్చు.
ఫార్మాసిటీ కారిడార్: కందుకూరు, యాచారం, కడ్తాల్, ముచ్చర్ల, ఆమన్‌గల్. ఫార్మా సిటీ వల్ల రియల్ రంగానికి కలిగే ప్రయోజనం ఏమిటనే విషయాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
జినోమ్ వ్యాలీ బయోటెక్ కారిడార్: యాప్రాల్, మచ్చబొల్లారం, శామీర్‌పేట్, తూముకుంట. ఈ ప్రాంతాల్లో ప్లాట్లు కొనేవారు రసాయన కాలుష్యం గురించి తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి.
వరంగల్ హైవే కారిడార్: బీబీనగర్, ఘట్‌కేసర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు. పుట్టగొడుగులా వెలసిన లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు, ఫామ్ లేఅవుట్లకు లెక్కే లేదు. కాబట్టి, అభివృద్ధికి చేరువగా ఉండేలా ప్లాట్లు కొనడం ఉత్తమం.
This website uses cookies.