మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నారా? మీ కంపెనీ ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ ప్రీలాంచ్‌లో విక్రయిస్తోందా? టార్గెట్లను చేరుకోవడం కోసమో.. కమిషన్ వస్తుందని ఆశపడో.. మీరూ వాటిని విక్రయిస్తున్నారా? మీరెంతో కష్టపడి కస్టమర్లను ఒప్పిస్తున్నారా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి. పొరపాటున మీ కంపెనీ గనక ప్రాజెక్టును ప్రారంభించకపోయినా.. ప్రభుత్వం నుంచి అనుమతి రాక ఆ నిర్మాణం నిలిచిపోయినా.. ఆయా సంస్థతో పాటు మీరు కూడా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. సాహితీ సంస్థ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయించిన కస్టమర్ రిలేషన్ మేనేజర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఇలాగే పోలీసు ఎఫ్ఐఆర్‌లో చేరారు. సాహితీ సంస్థ ఎండీ, డైరెక్టర్లతో పాటు వీరి మీద ఎఫ్ఐఆర్ నమోదైన విషయం మర్చిపోవద్దు.
ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట జరిగే స్కాముల్లో ఆయా సంస్థలో పని చేసే ఉద్యోగులూ నిందితులు అవుతారనే విషయం సాహితీ ప్రీలాంచ్ స్కామ్ ఉదంతం ద్వారా తెలిసింది. తమకు తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా.. ఇలాంటి స్కాముల్లో ప్రమేయం ఉన్న ఉద్యోగులూ జైలు పాలు కాక తప్పదు. తాజాగా వెలుగులోకి వచ్చిన సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణం ఇదే అంశాన్ని తెలియజేస్తోంది. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మందిని దాదాపు రూ.900 కోట్ల మేర నిలువునా ముంచేసిన సాహితీ ఇన్ ఫ్రాటెక్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఎలాంటి అనుమతులు తీసుకోక ముందే అమీన్ పూర్ లో 23 ఎకరాల స్థలంలో సాహితీ శ్రావణీ ఎలైట్ పేరుతో 38 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్ మెంట్లు కడుతున్నానని.. ప్రీ లాంచ్ ఆఫర్ కింద చదరపు అడుగుకీ రూ.2 వేల నుంచి రూ.3 వేలకే ఇస్తానంటూ ప్రచారం చేసి పలువురిని ఆకర్షించాడు. ఇలా దాదాపు 1700 మంది నుంచి రూ.539 కోట్లు వసూలు చేశాడు. ఇదే తరహాలో నగరంలోని పలు చోట్ల ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట మొత్తం 2500 మంది నుంచి రూ.900 కోట్ల వరకు వసూలు చేశాడు.
This website uses cookies.