Categories: Rera

జియో మ్యాపింగ్ ద్వారా అక్రమ నిర్మాణాల గుర్తింపు

  • సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడి

పాట్నాలో గంగానదీ తీరం వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలను జియో మ్యాపింగ్ ద్వారా గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా వరద నీరు సరిగా పారడం లేదని, ఫలితంగా చాలా ఆవాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొంటూ పాట్నా వాసి తొలుత జాతీయ హరిత ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ట్రిబ్యునల్ దానిని తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అక్రమ నిర్మాణాల గుర్తింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. జియో మ్యాపింగ్ ద్వారా అక్రమ నిర్మాణాలను గుర్తించే పని చేపట్టినట్టు కేంద్రం నివేదించింది. ఈ విధానం ద్వారా అక్రమ నిర్మాణాలు గుర్తించడం సాధ్యమేనని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఈ విధానం ద్వారా అక్రమ నిర్మాణాలు గుర్తించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ నాలాలు, చెరువులు ఆక్రమించి పెద్ద ఎత్తున ఇళ్లు కట్టేసిన నేపథ్యంలో చిన్నపాటి వర్షానికే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో మ్యాపింగ్ ద్వారా అలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించి తగిన చర్యలు చేపడితే వరద ముంపు సమస్య నివారించే అవకాశం ఉంది.

This website uses cookies.