దేశంలో ఉత్తమ ప్రమాణాల్ని ప్రవేశపెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. కాకపోతే, ఈసారి ఢిల్లీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ఆలోచించింది. భూగర్భజలాల్ని పెంపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. ఇంటి పైకప్పు మీద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకునే వారికి రూ.50,000 దాకా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని వెల్లడించింది. దీంతో బాటు నీటి బిల్లుల మీద పది శాతం తగ్గింపును ప్రకటించింది. మన హైదరాబాద్ మెట్రో బోర్డు తరహాలో పని చేసే ఢిల్లీ జల్ బోర్డు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వంద చదరపు మీటర్లు లేదా అంతకు మించిన విస్తీర్ణంలో ఇళ్లను కట్టుకున్న వారికీ అవకాశాన్ని కల్పించింది. కొత్తగా కట్టుకునేవారూ ఈ సౌలభ్యాన్ని అందుకోవచ్చు. ఈ సదుపాయాన్ని 2021 డిసెంబరు 31 వరకూ వర్తింపజేస్తారు. వాన నీటి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేవారు ఢిల్లీ జల్‌బోర్డు నుంచి ఎలాంటి పత్రం తీసుకోనక్కర్లేదు.
వాన నీటి సంరక్షణకు ప్రోత్సాహం
సామాన్యులు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించింది. ఆర్కిటెక్టుతో ధృవీకరణ పత్రం తీసుకుంటే సరిపోతుందని తెలియజేసింది. దీన్ని ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చులో దాదాపు యాభై శాతాన్ని ప్రభుత్వమే అందజేస్తుంది. పైగా, నీటి బిల్లులో పది శాతం సొమ్మును తగ్గిస్తుంది. మరి, తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అమలు చేస్తే భూగర్భజలాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే నిర్ణయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీసుకోవాల్సిన అవసరముంది.