Categories: CONSTRUCTION

ఇకపై అంతా హైబ్రిడ్ విధానమే..

  • పెద్ద సంస్థలన్నీ ఈ కొత్త పద్ధతికే మొగ్గు
  • రియల్ రంగంలోనూ రానున్న మార్పులు
  • చిన్న నగరాలు, పట్టణాలకు మరింత అడ్వాంటేజ్

కరోనా.. ప్రపంచంలో ఈ మహమ్మారి తెచ్చిన మార్పులెన్నో. ఇందులో అత్యంత ముఖ్యమైనది మనం పని చేసే విధానం పూర్తిగా మారిపోవడ‌మే. ఆఫీసులకు వెళ్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసే ఉద్యోగాలు.. ఒక్కసారిగా ఎక్కడి నుంచైనా చేసేలా మారిపోయాయి. కరోనా తగ్గిన తర్వాత కూడా చాలామంది ఈ విధానానికే మొగ్గు చూపడం.. సంస్థల యాజమాన్యాలు సైతం ఖర్చులు తగ్గించుకోవడానికి ఇదే మంచి మార్గమని భావించడంతో కొత్తగా హైబ్రిడ్ వర్క్ విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు అటు ఆఫీసు నుంచి ఇటు ఇంటి నుంచి కూడా పని చేయ‌వ‌చ్చు. అంటే ఏ సమయంలోనైనా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేస్తారు. మిగిలినవారు ఇంటి నుంచి పని చేస్తారు. దీంతో చాలా సంస్థలు ఈ విధానానికే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధానం రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనే అంశంపై ‘సిరిల్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఆ విశేషాలివీ..

హైబ్రిడ్ వర్క్ విధానం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మార్పులు తీసుకొచ్చింది. ఇంటి నుంచి పని విధానం పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు అవసరమైన సౌకర్యాలను ఇంట్లోనే ఉండాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అలాగే హైబ్రిడ్ పని విధానానికి అనుగుణంగా ఆఫీసులు ఉండాలని సంస్థల యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో వాటిపై రియల్ రంగం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హైబ్రిడ్ పని విధానానికి అనుకూలంగా భవనాన్ని నిర్మించి, సంబంధిత సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి.

వినియోగదారునికి సమర్థమైన, వేగవంతమైన కనెక్టివిటీ అందించే అంశంపైనే వ్యాపార సంస్థలు దృష్టి సారించాయి. ఇది ఆఫీస్ స్పేస్ ల అధునాతన నమూనా డిమాండ్ పెరగడానికి కారణమైంది. ముఖ్యంగా కో వర్కింగ్ స్పేస్ లు, కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతో కూడిన చిన్న ఫార్మాట్ ఆఫీస్ స్పేస్ లకు డిమాండ్ పెరగడం, మనకు కావాల్సిన విధంగా వాటిని మార్చుకునే వెసులుబాటు కలిగి ఉండటం వంటి అంశాలు అందరూ వీటివైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. అంతిమంగా స్మార్ట్ ఆఫర్లను అందించే వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ డెవలపర్లను తయారుచేయడానికి దారితీసింది.

వాయిస్ కమాండ్ తో కూడిన పెద్ద బెడ్ రూములు, స్టోరేజ్ యూనిట్లు, ఆటోమేటెడ్ విజిటర్ మేనేజ్ మెంట్ సిస్టం, సమావేశ మందిరాల్లో డిజిటల్ ఫ్లిప్ చార్ట్ ల వంటివి ఇతర వ్యాపారాలతో కనెక్టివిటీ పెరగడానికి, మొత్తం ఉత్పాదకతను పెంచడానికి దోహదపడనున్నాయి. ఇలాంటి సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన వాణిజ్యపరమైన ఆస్తులకు ఐటీ, కార్పొరేట్, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక గతేడాది కాలంగా ఆఫీసులు, కో వర్కింగ్ ప్రదేశాల్లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. డేటా సెక్యూరిటీ, ఫైర్ వాల్, అడ్మినిస్ట్రేషన్ తదితర కారణాల వల్ల మళ్లీ ఆఫీసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపయోగించని స్పేస్ ను తగ్గించి ఆ మేరకు ఆర్థికంగా లబ్ధి పొందేందుకు సంస్థలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు కొత్తవారిని ఆకర్షించడం కోసం ప్రాపర్టీ డెవలపర్లు వర్క్ స్పేస్ ను సురక్షితం, ఆరోగ్యవంతంగా ఉండేలా పలు ప్రమాణాలు పాటిస్తున్నారు. తక్కువ కేపిటల్, నిర్వహణ వ్యయం సరిపోయే హైబ్రిడ్ మోడల్ కే కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతుండటంతో కో వర్కింగ్ స్పేస్ కు డిమాండ్ పెరిగింది.

భారత్ లో మేజర్ మార్కెట్లు..

ముంబై, ఢిల్లీల్లో హైబ్రిడ్ మోడల్ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ కు మేజర్ మార్కెట్లు ఇవే. అక్కడ అధికంగా ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు, ఎక్కవ వర్క్ ఫోర్స్ కారణంగా చాలా కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మార్కెట్లు క్రమంగా హైబ్రిడ్ విధానం వైపు మారుతున్నాయి. అహ్మదాబాద్, జైపూర్, కొయంబత్తూర్, ఇండోర్, లక్నో, చండీగఢ్, నాగ్ పూర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలు కూడా వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ వైపు వెళుతున్నాయి.

ఇంటి దగ్గర్లో పని..

హైబ్రిడ్ విధానంతోపాటు తాజాగా వర్క్ నియర్ హోం (ఇంటి దగ్గర్లో పని) విధానం కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఇది జోరందుకోనుంది. వేర్వేరు ప్రదేశాల్లో చిన్న చిన్న ఆఫీసులు ఏర్పాటు చేయడమే ఈ కొత్త విధానం. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న నగరాల్లో వాణిజ్యపరమైన ఆఫీస్ స్పేస్ లకు డిమాండ్ పెరగనుంది. సంస్థల కార్యాలయాలు ఇలా చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు విస్తరిస్తే, ఆ మేరకు అక్కడ నివాసాలకూ డిమాండ్ పెరిగి రియల్ రంగం కళకళలాడుతుంది. ఈ నేపథ్యంలో అటు వినియోగదారులకు ఇటు పెట్టుబడిదారులకు చిన్న నగరాలు ఆకర్షణీయమైన గమ్యస్థానం కానున్నాయి.

This website uses cookies.