Categories: CONSTRUCTION

ఇల్లు క‌డుతున్నారా? ఇవి చూడాల్సిందే!

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అవును మరి ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమ‌నే చెప్పాలి. ఇంటి నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకుల ధరలు పెరగడంతో నిర్మాణవ్యయం క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఆర్కిటెక్ట్ తో ఇంటి ప్లాన్ ను గీయించుకుని, పక్కా ప్రణాళికతో కడితే ఇంటి నిర్మాణ వ్యయాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు.

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట.. ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా వారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. తమ కలల ఇంటి కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే అనుకున్న టైంలో.. అనుకున్న బడ్జెట్ లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఇల్లు కట్టుకునే క్రమంలో ప్రధానమైంది ఇంటి ప్లాన్. సొంతంగా డ్రాయింగ్స్‌ గీయడం, మేస్త్రీ మీదనే పూర్తిగా వదిలిపెట్టడం చేయకుండా ఇంటి నిర్మాణానికి సంబందించిన ప్లాన్ ను అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ తో గీయించాలి. చాలా మంది ఇంజినీర్ కు ఫీజు దండగ అని చెప్పి సొంత ప్రయోగాలు చేయడమే, రెడీమేడ్‌ ప్లాన్ల వైపు మొగ్గు చూపడమో చేస్తుంటారు. అలా కాకుండా ఇంజినీరును సంప్రదిస్తే మీ స్థలాన్ని పరిశీలించి, మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్‌ ఇస్తారు. అంతే కాకుండా స్ట్రక్చరల్‌ డిజైన్స్‌ తీసుకోవడం వల్ల పునాదులు, కాలమ్స్‌, బీమ్స్‌ ఎక్కడెక్కడ వస్తాయి? ఎంత స్టీల్‌ కావాలి? సిమెంట్‌, ఇసుక, ఇటుకల అవసరం ఎంత ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది.

కాలమ్స్‌, బీమ్స్‌, శ్లాబ్స్‌, గోడలు కట్టిన తర్వాత కూడా చాలామంది మార్పులు చేర్పులు చేస్తుంటారు. శ్లాబ్స్‌ కొంత భాగం తొలగించడం, కట్టిన గోడలు పగలగొట్టి మళ్లీ కట్టడం సర్వ సాధారణంగా జరుగుతుంటాయి. అందుకే ఇంజినీర్ ఇచ్చిన ప్లాన్‌ ప్రకారమే కట్టాలని మేస్త్రీకి స్పష్టంగా చెప్పాలి. సామగ్రి వృథాను సాధ్యమైనంత వరకు తగ్గేలా చూసుకోవాలి. సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేసేటప్పుడు 10 నుంచి 20 శాతం వృథా అవుతుంది. ఇది 8 శాతం మించకుండా ఉండాలని, అందుకోసం కింద పడిన సిమెంట్‌ను కొన్నిచోట్ల తిరిగి వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టైల్స్‌ వృథా సైతం 2 శాతం లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్లాబ్‌ పనులు, ఫ్లోరింగ్‌లో కాంక్రీట్‌ను వృథా చేయకుండా లింటెల్‌, సన్‌షేడ్‌ వంటి వాటిలో వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
మార్కెట్లో నిర్మాణ సామగ్రి ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంటి నిర్మాణం ఖర్చు కొంత తగ్గడమో లేదా పెరగడమే జరుగుతుంది. స్టీల్‌ టన్ను ధర ప్రస్తుతం 54 వేల నుంచి 67 వేల వరకు ఉంది. బ్రాండెడ్‌ స్టీల్ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. సిమెంట్‌ బస్తా కంపెనీని బట్టి 320 నుంచి 475 రూపాయల వరకు ఉంది. మార్కెట్లో నిర్మాణసామగ్రి ధరలు ఎక్కడ తక్కువగా ఉన్నాయో తెలుసుకుని, పక్కా ప్రణాళికతో ఇంటిని కట్టుకుంటే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.

This website uses cookies.