ప్రతి ఒక్కరూ సొంతిల్లు ఉండాలనే కోరుకుంటారు. చాలామంది ఇండిపెండెంట్ హోమ్ నే ఇష్టపడతారు. అది కూడా తాము సొంతంగా నిర్మించుకోవాలని భావిస్తారు. తమ ఇష్టాలకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కట్టుకోవాలని చూస్తారు. అయితే, ఇల్లు కట్టడం అంటే అంత సులభం కాదు కదా? ఇందులో ఎన్నో అంశాలు, అంతకు మించిన వ్యయప్రయాసలు ఇమిడి ఉంటాయి. మరి ప్రస్తుతం మనదేశంలో ఓ ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? చూద్దామా?
సాధారణంగా ప్రస్తుత ధరల ప్రకారం 1000 చదరపు అడుగుల ఇల్లు కట్టడానికి దాదాపు రూ.12 లక్షల వ్యయం అవుతుంది. ఇది ఆ నగరం, లేబర్ లభ్యత, నిర్మాణ సామగ్రి సరఫరా వంటి ఇతర అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. మరి మనం కట్టుకోవాలనే ఇంటికి ఎంత అవుతుందో ఎలా లెక్కించాలో తెలుసా? ముందుగా ప్లాట్ లేఔట్. ఆర్కిటెక్ట్ లేదా డిజైనర్ రూపొందించే ప్లాన్ తో ఇల్లు నిర్మాణం అనే ప్రక్రియ మొదలవుతుంది. ఆర్కిటెక్ట్ ఫీజు రూ.15 వేల నుంచి మొదలవుతుంది.
రెండో అంశం.. భవన నిర్మాణ నిబంధనలు.. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీంతో ప్రాజెక్టు డెడ్ లైన్ ను బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఉదాహరణకు మీ భూమి పర్యావరణపరంగా సెన్సిటివ్ ప్రాంతంలో ఉంటే.. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అదనపు వ్యయం, అదనపు సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే కొన్ని తప్పనిసరి షరతులు అమలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో రెండు అంతస్తుల ఇల్లు కట్టాలంటే.. కచ్చితంగా స్టిల్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. ఇది కూడా మీ ఇంటి నిర్మాణ వ్యయాన్ని ప్రభావితం చేస్తుంది.
సివిల్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అనే రెండు అంశాలు భవన నిర్మాణ వ్యయంలో కీలకపాత్ర పోషిస్తాయి. సివిల్ వర్క్ అంటే.. ప్లింత్, గోడలు, రూఫ్, బౌండరీ వాల్; పారాపీట్, ప్లోర్ వర్క్, ప్లాస్టరింగ్ వంటివి ఉంటాయి. వీటికి సంబంధించిన రా మెటీరియల్ తోపాటు కాంట్రాక్టర్, లేబర్ ఖర్చులు ఇందులోకి వస్తాయి. బ్రిక్ వాల్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.800 (ఆర్ సీసీ లేకుండా) రూ.900 (ఆర్ సీసీతో) అవుతుంది. సివిల్ పనులకు చదరపు అడుగుకు రూ.1500 చార్జి చేస్తారు. ఇక ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్ చదరపు అడుగుకు రూ.2500 తీసుకుంటారు. రా మెటీరియల్స్ కు రూ.7 లక్షల నుంచి మొదలవుతాయి. అయితే, ఇవన్నీ రాష్ట్రాన్ని బట్టి మారతాయి.
ఇక ఫినిషింగ్ వర్క్స్ విషయానికొస్తే.. డోర్లు, కిటికీలు, వుడెన్ వర్క్, ఎలక్ట్రిక్ ఫిట్టింగులు, శానిటరీ ఫిట్టింగులు, పాప్ వర్క్, గ్రిల్ వర్క్ వంటివి ఉంటాయి. ఇది చదరపు అడుగుకు మన ఎంచుకునే అంశాలను బట్టి రూ.500 నుంచి రూ.3వేల వరకు అవుతుంది. మొత్తమ్మీద 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి సంబంధించి చదరపు అడుగుకు అయ్యే వ్యయం రూ.1300 నుంచి రూ.5 వేల మధ్య ఉండొచ్చు. ఇక్కడ కూడా మనం ఎంచుకునే క్వాలిటీ మెటీరియల్, ఇతరత్రా అంశాల ఆధారంగా వ్యయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్క మెటీరియల్ విషయాన్నే తీసుకుంటే 1000 చదరపు అడుగుల్లో సి క్లాస్ మెటీరియల్ తో ఇంటిని నిర్మించాలంటే.. మెటీరియల్ కు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వ్యయం చేయాలి. అదే బి క్లాస్ మెటీరియల్స్ కావాలంటే రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షలు ఖర్చు పెట్టాలి. ఏ క్లాస్ మెటీరియల్స్ కావాలంటే రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు చేతిలో ఉంచుకోవాల్సిందే.