హైదరాబాద్‌లో రియల్ రంగానికి గల గిరాకీ గురించి క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా యావత్ భారతదేశానికి తెలిసిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్‌లో ఇటీవల జరిగిన ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. కరోనా ప్యాండమిక్‌లో భారీ స్థాయిలో సందర్శకులు విచ్చేశారని.. ఈసారి అసలైన ఇళ్ల కొనుగోలుదారులు మాత్రమే ప్రాపర్టీ షోకు విచ్చేశారని చెప్పారు. అధిక శాతం మంది సందర్శకుల్లో సమయం వృథా చేయకుండా.. తమ బడ్జెట్‌కు నచ్చిన గృహాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని వివరించారు. కొన్ని స్టాళ్లలో అయితే కొనుగోలుదారులు నేరుగా అడ్వాన్సు చెల్లించి ఫ్లాట్లను బుకింగ్ కూడా చేసుకున్నారని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కొనుగోలుదారులు గతంలో మాదరిగా పది, ఇరవై ప్రాజెక్టుల్ని చూసేందుకు సమయాన్ని వెచ్చించడం లేదు. ఒక ప్రాజెక్టు లొకేషన్, అందులో ఎన్ని ఫ్లాట్లు వస్తాయి? ఎలివేషన్ ఎలా ఉంది? అందులో పొందుపరిచే సదుపాయాలు, సౌకర్యాలు, బిల్డరుకు అపార్టుమెంట్‌ను పూర్తి చేసే సత్తా ఉందా.. వంటి విషయాల్ని గమనించి.. సొంతింటికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటున్నారు. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో కొందరు కొనుగోలుదారులు స్టాళ్లలోనే అడ్వాన్సులిచ్చి ఫ్లాట్లు బుక్ చేసుకోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నగర రియల్ రంగంలో గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గలేదని చెప్పడానికి నిదర్శనమిదే. ఈ సానుకూల వాతావరణం వచ్చే మార్చి వరకూ కొనసాగుతుందనే నమ్మకముంది.
ప్యాండమిక్‌లో బయ్యర్లు బయటికొస్తారా? లేదా? అనే సందేహాలన్నీ మొదటి రోజే పటాపంచలయ్యాయి. సందర్శకుల్లో మధ్యతరగతి ప్రజానీకం రెండు పడక గదుల ఫ్లాట్ల వివరాలు తెలుసుకుంటే, మిగతావారు రూ.1-1.50 కోట్లలో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ల గురించి కనుక్కున్నారు. అది కూడా ప్రీమియం లొకేషన్ల మీదే వీరు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కాస్త శివార్లకైనా వెళ్లి విల్లాలు కొనుక్కునేవారు.. రూ.2-2.5 కోట్ల బడ్జెట్ ఇళ్లపై ఆసక్తి చూపెట్టారు. అనూహ్యంగా పెరిగిన భూముల ధరల వల్ల అందుబాటు ధరలో ఫ్లాట్లను మధ్యతరగతి ప్రజానీకానికి కట్టించాలంటే.. ప్రభుత్వం నామమాత్రపు ధరకే భూముల్ని బిల్డర్లకు కేటాయించాలి. అందులో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలి. లేకపోతే, పెరిగిన స్థలాల ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే, అందుబాటు ఇళ్లను కట్టడం అసాధ్యమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా పలు దేశ, విదేశీ ఉత్పత్తి సంస్థలు హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులకు అందుబాటు ధరలో ఇళ్లను కట్టివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి, ఈ పనిని ప్రైవేటు బిల్డర్లకు అప్పగించడం ఉత్తమం. ఉదాహరణకు చందన్ వేలీలో అమెజాన్, వెల్‌స్పన్ వంటి వాటిలో సుమారు రెండు నుంచి మూడు వేల మంది పని చేస్తున్నారు. వీళ్లంతా ప్రతిరోజు శంషాబాద్ వరకూ రావాలంటే కష్టమే. పైగా, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు ఆస్కారముంది. కాబట్టి, ఈ క్లస్టర్‌లో పని చేసే ఉద్యోగులకు అక్కడే ఇళ్లను కట్టిస్తే ఉత్తమం. ఫార్మా సిటీ వద్ద మౌలిక సదుపాయాల్ని మెరుగుపరిచి డెవలపర్లకు అందజేస్తే నాణ్యమైన గృహాల్ని కట్టడానికి వీలు కలుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని.. అక్కడక్కడా ఐదు నుంచి ఇరవై ఎకరాల్లోపు భూముల్ని వివిధ డెవలపర్లకు కేటాయించాలి. అప్పుడే వారిలోనూ పోటీతత్వం పెరుగుతుంది. నాణ్యమైన అపార్టుమెంట్లను అందించేందుకు వీలు కలుగుతుంది. ఉదాహరణకు పటాన్‌చెరు సుల్తాన్‌పూర్, మహేశ్వరం ఈ-సిటీ, బుద్వేల్, కొల్లూరు.. ఇలా హైదరాబాద్ నలుమూలల్లో ప్రభుత్వం సామాన్యులకు అవసరమయ్యే గృహాల్ని నిర్మించాలి. టౌన్‌షిప్ పాలసీలో ప్రైవేటు డెవలపర్లకు నామినల్ ధరకే స్థలం అందజేసినా మంచి నిర్ణయమే అవుతుంది. విజయవాడ హైవే నుంచి మేడ్చల్ హైవే దాకా అందుబాటు గృహాల్ని కట్టేందుకు అనువుగా ఉంటాయి. కాబట్టి, ఈ ప్రాంతాల్లోనైనా నామామత్రపు రేటుకు అందించేలా చేయాలి.
This website uses cookies.