రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో రైతులు భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడొద్దనేది ఆయన ఉద్దేశ్యం. భవనాల్ని నిర్మించే బిల్డర్లూ భూముల రికార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేయాలన్నది సీఎం సంకల్పం. ఇంతటి వ్యూహాత్మక ఆలోచనలకు తగ్గట్టుగా.. ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ధరణిలో ఎదురయ్యే వాస్తవిక సమస్యలకు పరిష్కారం చూపెడితే.. ఇది వంద శాతం విజయవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ధరణికి సంబంధించి స్టేక్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు. లేకపోతే ధరణి రైతులపాలిట ఒక పెద్ద గుడిబండగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఒక రైతుకు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమి ఉంది. అతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇటీవల అతను మరణించారు. అయితే, భూమికి సంబంధించిన లీగల్ హెయిర్స్ (కుమారులు, కుమార్తెలు) గురించి ధరణిలో ప్రత్యేకంగా కాలమ్ పెట్టలేదు. దీంతో, ఆయా భూమిని పంచుకునే విషయంలో ఆ కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఆస్తి తగాదాల్లో ఎక్కువగా భాగాలు పంచుకోవడం వద్దే వస్తుంది కదా? మరి, ఆస్తికి సంబంధించి ఇంత కీలకమైన అంశాన్ని ధరణి పోర్టల్‌లో ఎందుకు చేర్చలేదు?
This website uses cookies.