గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికల్ని రూపొందిస్తామని తెలంగాణ టౌన్ ప్లానర్స్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీపీఐ) నూతన ఛైర్మన్ కొమ్ము విద్యాధర్ తెలిపారు. ఐటీపీఐ ఛైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరళమైన రవాణా వ్యవస్థలతో పాటు పర్యావరణహితమైన పద్ధతులలో అభివృద్ధి చెందడానికి సమగ్ర ప్రణాళికా విధానాలను రూపొందించడానికి కృషి చేస్తామన్నారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. వాటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. సమగ్రమైన ప్రణాళికా విధానాల్ని రూపొందించడానికి తరుచూ సదస్సుల్ని నిర్వహిస్తాం. రాష్ట్రంలోని ప్రజల జీవన విధానాలు స్థితిగతుల్ని గమనిస్తాం. జలవనరులు, రవాణా వ్యవస్థ వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని.. వాటిని అనుసంధానిస్తూ.. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి జరిగేలా మార్గదర్శకాల్ని రూపొందిస్తాం.
కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల ప్రకారం ఐటీపీఐ పట్టణాభివృద్ధికి కావాల్సిన విధి విధానాలను రూపొందించింది. వీటిని పలు ప్రభుత్వరంగ సంస్థలు అమలు పరుస్తున్నయి. ప్రణాళికా రంగంలోని అధునాతన అభివృద్ధిని, పరిశోధనాత్మక విషయాలను ప్రచురిస్తూ త్రైమాసిక పత్రికలు విడుదల చేస్తుంది. కామన్వెల్త్ అసోషియేషన్ ఆఫ్ ప్లానర్స్ (క్యాప్) లో కామన్వెల్త్ అసోషియేషన్ ఆఫ్ ప్లానర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఐటీపీఐ వ్యవహరిస్తోంది.