కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లకు చెందిన స్థలాలు, ప్రధానేతర ఆస్తుల విక్రయాన్ని కేంద్రం మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఎయిరిండియాను అమ్మేసిన మోదీ సర్కారు.. నిధుల సమీకరణ కోసం ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ వంటి సంస్థల స్థలాలు, ప్రధానేతర ఆస్తులను విక్రయించాని నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం తాజాగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ)ను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్, బీఅండ్ఆర్, బీఈఎంఎల్, హెచ్ఎంటీ లిమిటెడ్, ఇన్ స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ వంటి సీపీఎస్ఈలకు చెందిన 3400 ఎకరాల భూములను గుర్తించారు. వీటిని, ఇతర ఆస్తులను విక్రయించే బాధ్యతలను ఎన్ఎల్ఎంసీ చూసుకుంటుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సొంత సంస్థ అయిన ఎన్ఎల్ఎంసీని రూ.5వేల కోట్ల ప్రారంభ షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల సబ్ స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ తో ఏర్పాటు చేసినట్టు కేంద్రం బడ్జెట్ లో పేర్కొంది. 2021-22 నుంచి 2024-25 మధ్యకాలంలో ఈ ఆస్తుల అమ్మకం ద్వారా దాదాపు రూ.6 లక్షల కోట్లు సమీకరించుకునే వీలుందని వెల్లడించింది.
This website uses cookies.