Categories: LATEST UPDATES

హౌసింగ్ సొసైటీ ఆఫీస్ బేరర్లకు జరిమానా

మనం ఇల్లు కొనుక్కున్నా.. అద్దెకు ఉంటున్నా.. సదరు హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్ మెంట్ కు నెలనెలా మెయింటెనెన్స్ కింద కొంత మొత్తం చెల్లించాల్సిందే. అలా వచ్చిన మొత్తాన్ని దాని నిర్వహణకు, మరమ్మతులు తదితర ఖర్చులకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే, సదరు సొసైటీలు జవాబుదారీతో వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చిక్కులు తప్పవు. తాజాగా మహారాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇలాంటి కేసులో కీలక తీర్పు వెలువరించింది. వర్షం నీటి కారణంగా లీకేజీ అయి తన ఫ్లాట్ పాడైపోతుందని, వెంటనే తగిన మరమ్మతులు చేయించాలంటూ ఓ ఫ్లాట్ యాజమాని పదేపదే చేసిన అభ్యర్థనలను పట్టించుకోని వ్యక్తులపై కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.

సదరు హౌసింగ్ సొసైటీతోపాటు వ్యక్తిగతంగా నలుగురు ఆఫీస్ బేరర్లను బాధ్యులుగా చేసింది. బాధితుడికి ఒక్కొక్కరు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే హౌసింగ్ సొసైటీ సైతం మరమ్మతుల కోసం రూ.91000, బాధితుడి మానసిక వేదనకు రూ.2.25 లక్షలు పరిహారం చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు స్వాతి సృష్టి సీహెచ్ఎస్ లిమిటెడ్ కు, దాని ఆఫీస్ బేరర్లకు ఆదేశాలు జారీచేసింది.

నందకుమార్ శెట్టి అనే ఫ్లాట్ యజమాని వర్షపు నీటి లీకేజీ కారణంగా తన ఫ్లాట్ పాడైపోతోందని, ఇప్పటికే బాత్ రూంలోని సీలింగ్ కూలిపోయిందని, వెంటనే లీకేజీ నిరోధించేందుకు మరమ్మతులు చేయించాలని సొసైటీకి విన్నవించారు. కానీ వారు దానిని పెడచెవిన పెట్టారు. దీంతో ఆయన జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. కేసును అది తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. విచారణ జరిపిన కమిషన్.. సొసైటీ వ్యవహారం సేవాలోపం కిందకే వస్తుందని స్పష్టంచేసింది.

This website uses cookies.