Categories: LATEST UPDATES

ఆఫీసు అద్దెలంటూ.. న‌యా మోసం షురూ!

  • సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌
  • తెలంగాణ రెరా అథారిటీ హెచ్చ‌రిక‌

హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి క‌డుతున్న భారీ ఆఫీసు స‌ముదాయం..
పాతిక ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే చాలు.. ప్ర‌తినెలా 25 వేలు అద్దె గ్యారెంటీ..

నాన‌క్‌రాంగూడ‌లో.. కో-వ‌ర్కింగ్ స్పేస్‌లో పెట్టుబ‌డి పెట్టండి..
ఊహించ‌ని రీతిలో నెల‌నెలా అద్దె అందుకోండి..

ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు త‌రుచూ సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రి, ఇవి నిజంగానే ప్ర‌తినెలా ఠంచ‌నుగా అద్దె చెల్లిస్తాయా? మ‌నం పెట్టే పెట్టుబ‌డికి నిజంగానే ఢోకా ఉండ‌దా? ఈ సంస్థ‌లు సొమ్ము వ‌సూలు చేసి పారిపోతే ఎలా ప‌ట్టుకోవాలి? మ‌న సొమ్మును మ‌ళ్లీ వెన‌క్కి ఎలా తెచ్చుకోవాలి? ఇలాంటి వాణిజ్య నిర్మాణాల‌కు రెరా అథారిటీ నుంచి అనుమ‌తి అక్క‌ర్లేదా?

ఐటీ స‌ముదాయం అయినా కో వ‌ర్కింగ్ స్పేసెస్ అయినా.. హైద‌రాబాద్‌లో ఒక నిర్మాణాన్ని ఆరంభించి విక్ర‌యాలు జ‌ర‌పాలంటే.. దానికి త‌ప్ప‌కుండా తెలంగాణ రెరా అథారిటీ నుంచి అనుమ‌తి తీసుకోవాల్సిందే. లేక‌పోతే, రెరా అథారిటీ ఆయా ప్రాజెక్టు నుంచి ముక్కుపిండి.. ప్రాజెక్టు అంచ‌నా విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానా విధిస్తుంది. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోయి.. చాలామంది రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టెంట్లు, ఏజెంట్లు.. అద్దె ఉచితమంటూ అమాయ‌క పెట్టుబ‌డిదారుల నుంచి సొమ్ము వ‌సూలు చేసే ప‌నిలో ప‌డ్డారు. అంద‌మైన బ్రోచ‌ర్లు ముద్రించి.. విదేశీ డిజైన్ల‌తో బోల్తా కొట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాబ‌ట్టి, వీరి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించండి. ఏదైనా ఆఫీసు సముదాయంలో స్థ‌లం కొనేందుకు పెట్టుబ‌డి పెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాక‌.. ముందుగా రెరా అథారిటీని సంప్ర‌దించండి. అక్క‌డ్నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చాకే తుది నిర్ణ‌యం తీసుకోండి.

This website uses cookies.