దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని.. ఆ చార్జీలను ఆయా అక్రమార్కుల నుంచే వసూలు చేయాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాలశాఖకు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సూచించింది. దీనికి సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఢిల్లీ మాస్టర్ ప్లాన్-2021 ఎంతవరకు అమలైంది? ఇంకా చేయాల్సిన పనులేంటి? ఇప్పటివరకు పనుల్లో జరిగిన జాప్యాలకు కారణాలేంటి అనే విషయాలపై సవివర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ అంశంపై పీఏసీ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ప్రభుత్వానికి చెందిన విలువైన భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఢిల్లీ డెవలప్ మెంట్ అథార్టీ (డీడీఏ) కూల్చివేసింది. మళ్లీ అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, అక్రమ నిర్మాణదారులను కనిపెట్టడంలోనూ, వారి నుంచి చట్టపరమైన జరిమానా వసూలు చేయడంలోనూ డీడీఏ విఫలమైందని పీఏసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత చార్జీలు వసూలు చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పీఏసీ అభిప్రాయపడింది.
This website uses cookies.