Categories: LATEST UPDATES

అక్రమ నిర్మాణాలపై జీఎంసీ ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) నిర్ణయం తీసుకుంది. తనిఖీల్లో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు కనిపిస్తే ప్లానింగ్ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జీఎంసీ కమిషనర్ చెకూరి కీర్తి హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ వాటిని గుర్తించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. గుంటూరులో అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతుండటంపై కమిషనర్ ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

‘ఇకపై ఇలాంటి వాటిని సహించేది లేదు. తక్షణమే అక్రమ నిర్మాణాలన్నీ నిలిచిపోవాలి. సంబంధిత బిల్డర్లకు నోటీసులు ఇవ్వడంతోపాటు నా దృష్టికి తీసుకురావాలి’ అని సూచించారు. టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు పంపించే ప్రతిపాదనలను పట్టించుకోకుంటే సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా తాను వెనకాడబోనని హెచ్చరించారు. వార్డు ప్లానింగ్ సెక్రటరీలతో వారానికోసారి సమావేశం ఏర్పాటుచేసి పనుల పురోగతిని సమీక్షించాలని సిటీ ప్లానర్ కు సూచించారు. అలాగే హోర్డింగులకు సంబంధించి జీఎంసీకి ఎలాంటి ఫీజూ చెల్లించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. అనుమతి లేని హోర్డింగులు, బ్యానర్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.

This website uses cookies.