Categories: LATEST UPDATES

అద్దెకిచ్చే ముందు అన్నీ పరిశీలించాలి

  • లేకుంటే జరిమానా తప్పదు
  • ఇళ్ల యజమానులకు సీఎం స్పష్టీకరణ

ప్రముఖ పర్యాటక రాష్ట్రం గోవాలో నేరాలను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలో ఎలాంటి కారణం లేకుండా నివసించే వారిని గుర్తించి జైలుకు పంపిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. ఇళ్లను అద్దెకు ఇచ్చేముందు అద్దెదారులు ఎవరనే విషయం పరిశీలించని యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘గోవాలో అద్దెదారుల పరిశీలనను పోలీసులు ప్రారంభించారు. అద్దెదారులు ఎవరనే విషయం పరిశీలించకుండా ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులకు జరిమానా విధిస్తారు. అందువల్ల ఇంటికి అద్దెకు ఇచ్చేముందు అద్దెదారుల వివరాలన్నీ పరిశీలించాలని కోరుతున్నా’ అని సావంత్ పేర్కొన్నారు. అద్దెదారుల వివరాలు అందుబాటులో ఉంటే గోవాలో జరిగే నేరాలను అరికట్టడానికి పోలీసులకు వీలవుతుందని చెప్పారు.

గోవా (అద్దెదారుల పరిశీలన) బిల్లు 2021 ప్రకారం తమ ఇళ్లలో అద్దెకు ఉండేవారి వివరాలు సమర్పించని యజమానులకు జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆరు నెలల జైలు, రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అక్కడి నుంచి సెలక్ట్ కమిటీకి పంపించారు. కాగా, ఇలాంటి పద్ధతిని హైదరాబాద్ లో కూడా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనేక ప్రాంతాలకు చెందిన వారు నిత్యం హైదరాబాద్ వచ్చి వెళుతుంటారు. చాలా మంది కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు.. వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? వంటి వివరాలు తెలుసుకోవడంతో పాటు వారి గుర్తింపును ధృవీకరించే కార్డులను తీసుకున్న తర్వాతే ఇంటిని అద్దెకు ఇవ్వాలని.. అప్పుడే నగరంలో నేరాలను అరికట్టడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు.

This website uses cookies.