రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో.. పశ్చిమ హైదరాబాద్లో మార్కెట్ కంటే తక్కువ రేటుకే ఫ్లాట్లను విక్రయించాం.. కొన్నాళ్ల తర్వాత అక్కడ ధరలు మూడింతలు పెరిగాయి.. ఆంధ్రప్రదేశ్లో రాజధాని విభజన
జరిగిన తర్వాత 30 నుంచి 40 శాతం ఇళ్ల రేట్లు తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే.
కాకపోతే, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల.. హైదరాబాద్ కంటే మెరుగ్గా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) అభివృద్ధి చెందుతుందని స్క్వేర్ ఇన్ ఫ్రా ఎండీ, నరెడ్కో ఆంధ్రప్రదేశ్ సభ్యుడు పరుచూరి కిరణ్ కుమార్ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ రంగం తాజా పోకడల్ని ‘రియల్ ఎస్టేట్ గురు’కి ప్రత్యేకంగా వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
ఆటుపోట్లు అనేవి ఏ రియల్ రంగంలోనైనా సహజంగా కనిపించే పరిణామాలే. అవన్నీ తట్టుకుని నిలబడితే చాలు.. ఆతర్వాత ఆటోమెటిగ్గా వృద్ధి కనిపిస్తుంది. ఇందుకు హైదరాబాద్ నిర్మాణ రంగమే చక్కటి ఉదాహరణ. ఆర్థిక మాంద్యం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వల్ల కుదేలైన హైదరాబాద్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నది. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటన వెలువడ్డాక అమరావతి పరిధిలో రియల్ మార్కెట్ దెబ్బతింది. అయితే, ఇటీవల కాలంలో ఎంటీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఫలితంగా, రానున్న రోజుల్లో ఇక్కడి మార్కెట్ వృద్ధి చెందడానికి ఆస్కారముంది.
ఎంటీఎంసీ ఏర్పాటు..
- హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ తరహాలో.. 194.41 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంటీఎంసీ (మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- ప్రభుత్వ పరిపాలన భవనాలన్నీ ఇక్కడే నెలకొల్పారు.
- ఏపీఐఐసీకి సంబంధించిన భవనాలన్నీ ఈ లొకేషన్లోనే ఉన్నాయి.
- రూ.2000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎయిమ్స్ దాదాపు చివరి దశలో ఉంది. గత కొంతకాలం నుంచి ఇక్కడ ఔట్ పేషెంట్ బ్లాకులో అందుబాటులోకి వచ్చేసింది. ఇన్ పేషెంట్ ఇతర విభాగాలు అతిత్వరలో ఆరంభమవుతాయని తెలిసింది. ఎయిమ్స్ ప్రత్యేతక ఏమిటంటే.. దీనికి మెయిన్ ఎంట్రెన్స్ ను ఎన్ హెచ్ 5 డీజీపీ ఆఫీసు దగ్గర్నుంచే ఇచ్చారు. ఫోర్ లేన్ రోడ్ల డక్టులు, డ్రైనేజీ, సివిల్ పని పూర్తయ్యింది. బీటీ రోడ్లు వేస్తున్నారు.
- మణిపాల్ ఆస్పత్రి పక్కన కరకట్ట రోడ్డును హై కోర్టు వరకూ డెవలప్ చేస్తున్నారు.
- సీఎం ఇంటి చుట్టుపక్కల దాదాపు పన్నెండు ఎకరాల్ని ఔట్ రేట్ గా కొన్నారు. అందులో 300 ఇళ్లను కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తొలుత ప్లాట్లను కేటాయిస్తున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ప్రాంతాల సుందీకరణ అనగా కెనాల్ డెవలప్మెంట్, రివర్ బెడ్, రోడ్ కనెక్టివిటీ వంటి విషయాలపై దృష్టి పెడుతోంది.
ఆరంభ ధర.. రూ.2,800
ఎంటీఎంసీలో ఫ్లాట్ల ధరల విషయానికొస్తే.. ఐదు అంతస్తుల అపార్టుమెంట్ల రేటు చదరపు అడుక్కీ రూ.2,800 నుంచి గరిష్ఠంగా రూ.3,500గా చెబుతున్నారు. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల్లో రూ. 3500 నుంచి రూ.5,500 దాకా రేటు ఉంది. విల్లా ప్రాజెక్టుల విషయానికొస్తే.. 4500 నుంచి రూ.8000 దాకా ఉంటుంది. ప్రాంతాలు, అందులో పొందుపరిచే సదుపాయాలు, నిర్మాణ పరిస్థితిని బట్టి తుది రేటు ఆధారపడుతుంది. మొత్తానికి, ఎలా చూసినా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వేల ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితిని బట్టి బిల్డర్లు అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు.
10 అంతస్తుల ప్రాజెక్టు..
2012లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. అమరావతి రాజధానిగా ప్రకటించగానే 2014లో మంగళగిరిలో 60 ఫ్లాట్ల అపార్టుమెంట్ పూర్తి చేశాను. మంగళగిరిలో ఎయిమ్స్, డీజీపీ ఆఫీసు నడిమధ్యలో 183 ఫ్లాట్లు గల పది అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నాను. ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేస్తాను. ఇందులో యాభై శాతానికి పైగా ఫ్లాట్లను విక్రయించాం. నిర్మాణ పురోగతిని బట్టి చాలామంది ఇందులో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బయ్యర్స్ మార్కెట్
ఎంటీఎంసీ.. ప్రస్తుతం బయ్యర్స్ మార్కెట్ గా మారింది. ఫ్లాట్ల రేట్లు దాదాపు ముప్పయ్ నుంచి నలభై శాతం తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు చేస్తే.. వచ్చే రెండు, మూడేళ్లలో తప్పనిసరిగా రేటు రెండింతలయ్యే అవకాశముంది.
– ఈ ఇంటర్వ్యూ పై మీ అభిప్రాయాన్ని REGPAPER21@GMAIL.COM కి పంపండి