- క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ గా గుమ్మి రాంరెడ్డి ఎన్నిక
- తెలంగాణ డెవలపర్‌కు జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం
- నల్గొండకు చెందిన గుమ్మి రాంరెడ్డి, ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణకు ఛైర్మన్..
దేశంలోని చిన్న, మధ్యతరహా డెవలపర్లకు పూర్తి స్థాయిలో సాయం అందించడంతో పాటు వారు ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు అవసరమయ్యే సహాయ సహకారాన్ని అందజేస్తానని క్రెడాయ్ తెలంగాణ ఛైర్మన్ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన జాతీయ స్థాయిలోని క్రెడాయ్ నేషనల్ సంఘానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఎస్ న్యూస్‌తో గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో క్రెడాయ్ డెవలపర్ల బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ప్రతి బిల్డర్లు పాటిస్తూ.. కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లను అందించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ప్రతి రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధికి అవసరమయ్యే సలహాలు, సూచనల్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని.. స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేస్తామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీని పెంచేందుకు విశేషంగా కృషి చేస్తామని చెప్పారు.
గుమ్మి రాంరెడ్డి ప్రత్యేకత ఏమిటంటే.. క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఆయన రాష్ట్రంలో అధిక శాఖలను ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. నల్గొండకు చెందిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సాధించారు. 2019లో ఇజ్రాయేల్‌లో జరిగిన నాట్‌కాన్ సదస్సును విజయవంతం చేయడంలో క్రియాశీలక భూమిక పోషించారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే.. దేశవ్యాప్తంగా గల క్రెడాయ్ సభ్యులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. గత కొంతకాలం నుంచి క్రెడాయ్ విలువను ఇనుమడింపజేయడంలో గుమ్మి రాంరెడ్డి వ్యూహాత్మక పాత్రను పోషించారు. అందుకే ఆయన క్రెడాయ్ ఉపాధ్యక్షుడి స్థాయికి చేరుకున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడిగా హర్షవర్దన్ పటోడియా ఎన్నికయ్యారు. సతీష్ మగర్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. బొమన్ ఇరానీ తర్వాత ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు.