నిన్నటి వరకూ.. శివారు ప్రాంతాల్లో ఓ ముప్పయ్, నలభై లక్షలు పెడితే సామాన్యులు టూ బెడ్‌రూం ఫ్లాట్ కొనుక్కునేవారు. బండ్లగూడ నుంచి బడంగ్ పేట్ దాకా ఎంచుకునేవారు. కాస్త సొమ్మున్నవారంతా వ్యక్తిగత గృహాల వైపు మొగ్గు చూపేవారు. కానీ నేడో.. అభివృద్ధికి సంబంధించి ఒక ప్రకటన విడుదలైతే చాలు.. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కాకపోయినా, ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు ఏర్పాటు కాకపోయినా.. ముందుగా భూముల రేట్లను పెంచేస్తున్నారు. దీంతో, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల హైదరాబాద్‌లో దూరమైంది. మరి, రూ.50 లక్షల్లోపు రెండు పడక గదుల ఫ్లాట్లు ఎక్కడ లభిస్తున్నాయి?
హైదరాబాద్‌లో మీరు సొంతిల్లు కొనుక్కోవాలంటే.. ఓఆర్ఆర్ లోపలి భాగాన్ని ఎంచుకోండి. ప్రధాన ప్రాంతాల్లో కొనడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి, మెట్రో స్టేషన్లకు ఓ ఐదారు కిలోమీటర్ల దూరంలోనైనా అందుబాటు ధరలో దొరికితే కొనుగోలు చేయాలి. ఒకవేళ మీరు సెక్రటేరియట్‌లో పని చేస్తున్నట్లయితే.. మియాపూర్ స్టేషన్ కి ఐదారు కిలోమీటర్ల దూరంలో కొనుగోలు చేసినా సరిపోతుంది. మియాపూర్‌లో కొందరు బిల్డర్లు రేట్లు మరీ పెంచేశారు. కాబట్టి, అమీన్‌పూర్, ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట్ వంటి ప్రాంతాల్లో కొనుగోలు చేయవచ్చు. ఇక్కడైతే కనీసం నలభై ఐదు, యాభై లక్షల్లో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు దొరికే అవకాశముంది.
కొల్లూరులో కొనవచ్చా?
మీరు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లయితే.. కొల్లూరు, వెలిమల, పాటి ఘనపూర్, ఇక్ఫాయ్ కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా మీకు నచ్చిన ఫ్లాటు కొనుగోలు చేయండి. లేదా నార్సింగి సమీపంలోని మంచిరేవుల వద్ద కాస్త రేట్లు అందుబాటులో ఉన్నాయి. అల్కాపురి కాలనీలో అయితే రేట్లు మరీ ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడ ఫ్లాట్లు కట్టేవారు ఎక్కువయ్యారు. కొనుగోలు చేసేవారూ తగ్గారు. అల్కాపురి చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో మరో నిజాంపేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి, ఇక్కడ కొనడం కంటే.. కాస్త దూరమైనా వెళ్లి.. మంచిరేవుల చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనడం మేలని గుర్తుంచుకోండి. అల్కాపురిలో వంద అడుగుల రోడ్డు అయితే మెరగ్గా ఉంది తప్ప.. అక్కడ్నుంచి కనెక్టివిటీ సమస్య అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు నుంచి గోల్కోండ, లంగర్ హౌజ్‌కు వెళ్లాలంటే రాత్రివేళలో కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే, కేవలం విశాలమైన ఈ రోడ్డును చూసి మీరు తుది నిర్ణయానికి రావొద్దు.
మీరు శంషాబాద్ విమానాశ్రయంలో పని చేస్తున్నట్లయితే అక్కడి సమీప ప్రాంతాల్లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. అద్దెలూ తక్కువగానే ఉన్నాయి. కాబట్టి, భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాన్ని చూసుకుని శంషాబాద్ లో సొంతిల్లు కొనుక్కోవడం అన్నివిధాల ఉత్తమం.
కొత్తవి కొంపల్లిలో..
ఇక ఉత్తర హైదరాబాద్ విషయానికొస్తే.. కొంపల్లి, మేడ్చల్ వంటి ప్రాంతాల్లోనూ నేటికీ ఫ్లాట్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయని గుర్తుంచుకోండి. రూ.50 లక్షల్లోపు ఫ్లాట్లు విరివిగా దొరకుతున్నాయి. అలాగనీ, హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ విధానంలో ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయకూడదు. తాజాగా, బౌరంపేట్, గండిమైసమ్మ వంటి ప్రాంతాల్లోనూ అపార్టుమెంట్లను నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడ కొనేటప్పుడు, మీ ఆఫీసుకు ఎంత చేరువలో అపార్టుమెంట్లు ఉన్నాయనే అంశాన్ని బేరీజు వేసుకోవాలి. విద్యాలయాలు, ఆస్పత్రులు వంటి వాటి కోసం ఎంత దూరం వెళ్లాల్సి ఉంటుందనే విషయంలోనూ ఓ అవగాహనకు రావాలి. ఆతర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఉప్పల్ ఉందిగా..
మెట్రో రైలు పుణ్యమా అంటూ ఉప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఇక, ప్రజలందరూ అక్కడ్నుంచి ఓ ఏడెనిమిది కిలోమీటర్ల దూరమైనా వెళ్లి కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటివరకూ ఎల్‌బీనగర్, వనస్థలిపురంలో ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండేవి. అక్కడా ఇదే పరిస్థితి. దీంతో, చాలామంది కొనుగోలుదారులు ఇందూ అరణ్య ప్రాజెక్టు దాటిన తర్వాత వచ్చే ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ రూ.50 లక్షల్లోపు డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు లభిస్తున్నాయి.