హెచ్ఎండీఏ అనుమతి ఉంది.. రెరా పర్మిషన్ కూడా సంస్థ తీసుకుంది.. కానీ, నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో తెలుసా? స్థానికంగా దుండిగల్ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్వోసీ తీసుకోలేదట.. అలాగైతే, హెచ్ఎండీఏ ఎలా అనుమతిని మంజూరు చేసింది? దానికి రెరా ఎలా పచ్చజెండా ఊపింది? అసలింత గుడ్డిగా హెచ్ఎండీఏ, దుండిగల్ మున్సిపాలిటీ ఎలా వ్యవహరించింది? ఇప్పుడీ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న బయ్యర్ల పరిస్థితి ఏమవ్వాలి?
దుండిగల్ ఔఆర్ఆర్ చేరువలో అర్బన్ రైజ్ ఆరంభించిన హ్యాపెనింగ్ హైట్స్ అనే ప్రాజెక్టు 2023 మార్చిలో నిలిచిపోయింది. సుమారు 3.88 ఎకరాల్లో ఆరంభించిన ఈ ప్రాజెక్టులో 19 అంతస్తుల్లో 847 ఫ్లాట్లను నిర్మించడానికి సంస్థ అనుమతిని తీసుకుంది. కాకపోతే, ఈ ప్రాజెక్టు ఎత్తు గురించి స్థానికంగా దుండిగల్ ఎయిర్‌పోర్టు అకాడమీ నుంచి అభ్యంతరం రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మార్చి నుంచి ఇప్పటివరకూ ఈ సమస్య పరిష్కారం గురించి సంస్థ నుంచి సమాచారం లేదని కొందరు కొనుగోలుదారులు అంటున్నారు. దీంతో, పలువురు బయ్యర్లు ఫ్లాట్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో సంస్థను సంప్రదించగా సరైన సమాధానం రావట్లేదని బయ్యర్లు వాపోతున్నారు. రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ఫ్లాట్ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, కట్టిన సొమ్మును మాత్రమే ఇస్తామని కొందరు ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారని మండిపడుతున్నారు. సంస్థ అవివేకం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోతే.. తామెందుకు ఆర్థికంగా నష్టపోవాలని బయ్యర్లు ప్రశ్నిస్తున్నారు. తాము వేరే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేస్తే.. ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని అంటున్నారు. కాబట్టి, కట్టిన సొమ్ముకు వడ్డీతో సహా చెల్లించాలని వీరంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ రెరా అథారిటీ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పంతొమ్మిది అంతస్తుల మీద రూఫ్‌టాప్ గ్రీన్ డైనింగ్, యోగా డెక్స్, పార్టీ మరియు బార్బీక్యూ ఏరియా, యాంఫీ థియేటర్, గేమింగ్ జోన్, కో- వర్కింగ్ స్పేస్ వంటివి నిర్మిస్తామని అర్బన్ రైజ్ తొలుత చెప్పింది. ఇప్పుడేమో అపార్టుమెంట్ ఎత్తు విషయంలోనే స్పష్టత లేకుండా పోయింది. ఒకవేళ అపార్టుమెంట్ ఎత్తును తగ్గిస్తే.. కొనుగోలుదారుల పరిస్థితి ఏం కావాలి? ఎనిమిది వందల మందిలో ఎంతమందికి సొమ్ము వెనక్కి ఇస్తారు? వారికి కలిగిన ఆర్థిక నష్టానికి ఎంతమేరకు పరిహారం చెల్లిస్తారు? ఇందుకు సంబంధించి రెరా అథారిటీ బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దుండిగల్ ప్రాజెక్టుకు సంబంధించి తాజా స్థితిగతుల్ని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ గురు ప్రయత్నించింది. సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించినా ఎలాంటి సమాధానం రాలేదు.
This website uses cookies.