Categories: LATEST UPDATES

రియల్ కు పండగ ఊపు

  • నాలుగో త్రైమాసికంలో జోరుగా ఇళ్ల విక్రయాలు

భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి మార్కెట్ సెంటిమెంట్, కొనుగోలుదారుల జేబుపై పడే ఆర్థిక ప్రభావం. ఈ రెండు అంశాలే ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తాయి. కోవిడ్ మహమ్మారి, ఎన్ బీఎఫ్ సీ రంగం రుణ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా పండగ సీజన్ లో రెసిడెన్షియల్ రంగం మంచి ఫలితాలే చూపించింది. అదే తరహాలో ఈ పండుగ సీజన్ కూడా రెసిడెన్షియల్ రియల్ రంగానికి మంచి ఊపు తెస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్-డిసెంబర్ నాలుగో త్రైమాసికం అంటే.. డెవలపర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆఫర్లు ప్రకటించే కాలం. డెవలపర్లు డిస్కౌంట్లు ప్రకటించడంతోపాటు సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలు కల్పించడం, ఫ్లోర్ రైజ్ ఛార్జీలు తగ్గించడం ద్వారా పండుగ సీజన్ ను క్యాష్ చేసుకుంటుండగా.. ఆర్థిక సంస్థలు ప్రాసెసింగ్ చార్జీలను తగ్గించడం, వన్ టైమ్ వడ్డీ రేటు తగ్గింపు వంటి ప్రకటనలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి.

ఇలా ఈ పండుగ సీజన్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కు ఊపు తెస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరికీ ఓ భావోద్వేగమైన భావనగా ఉంటుంది. ‘సాధారణంగా క్యూ4 పండుగ సీజన్ కాబట్టి, ఈ సమయంలో ఇళ్ల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అదే సమయంలో డిస్కౌంట్లు, వడ్డీ రాయితీల వంటివి కూడా కొనుగోలుదారులన ఆకర్షిస్తాయి. ఏటా జరిగే రెసిడెన్షియల్ విక్రయాల మొత్తంలో ఒక్క ఈ త్రైమాసికంలోనే 40 శాతం అమ్మకాలు జరుగుతాయి. ఈ త్రైమాసికంలో జరిగిన విక్రయాలు గతేడాది క్యూ4లో జరిగిన విక్రయాలను ఇప్పటికే అందుకున్నాయి. దీనిని బట్టి ఈ త్రైమాసికం పూర్తయ్యే నాటికి అదనంగా మరో 20 నుంచి 30 శాతం విక్రయాలు జరిగే అవకాశం ఉంది’ అని కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యాగ్నిక్ తెలిపారు.

This website uses cookies.