సరిగ్గా వ్యవహరించి, తెలివిగా పెట్టుబడి పెడితే.. స్థిరాస్తి రంగాన్ని మించిన ఆదాయం మరొకటి ఉండదు. భారతదేశంలోని ధనవంతులు ఇదే సూత్రాన్ని అనుసరించి తమ పెట్టుబడులను విజయవంతంగా పెంచుకుంటున్నారు. రూ.5 కోట్లను ఐదు నుంచి 8 సంవత్సరాల్లో రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు మార్చుకుంటున్నారు. రియల్ రంగంలో ఇదో ఇన్ సైడర్ వ్యూహమని.. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తెలివిగా ఈ విధానం అవలంభించి విజయం సాధిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అదేంటో చూద్దామా?
మొదటి అడుగు
బ్రాండెండ్ కంపెనీలు నిర్మించే ప్రాజెక్టులను ఎంచుకోవడం ద్వారా ఈ విధానంగా మొదటి అడుగు పడుతుంది. స్వాధీనానికి రెండు నుంచి మూడేళ్ల వ్యవధి ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెడతారు. అప్పుడు ధరలు మార్కెట్ రేటు కంటే 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటాయి. ఈఎంఐ లేదా వడ్డీ భారం కూడా ఉండదు. అంటే చెల్లించేది తక్కువ. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా దాని విలువ కూడా బాగా పెరుగుతుంది.
రెండో అడుగు..
ప్రాజెక్టు స్వాధీనం చేసిన తర్వాద ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరుగుతాయి. బ్రాండెడ్ ప్రాజెక్టులు, భద్రత గురించి ఆలోచించే హెచ్ఎన్ఐలు, ఎన్నారైలు వీటి పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆ సమయంలో పెట్టుబడిదారులు ఆ ప్రాపర్టీని విక్రయించడం ద్వారా లాభాలు పొందొచ్చు లేదా లీజుకు ఇవ్వడం ద్వారా 5 నుంచి 7 శాతం మేర అద్దె ఆదాయం ఆర్జించొచ్చు.
మూడో అడుగు..
రెసిడెన్షియల్ ప్రాపర్టీలను ఇలా విక్రయించడం ద్వారా వచ్చే రాబడితో అధిక ఆదాయం అందించే షాప్ కమ్ ఆఫీసులు, కమర్షియల్ ప్రాపర్టీలు, వ్యూహాత్మక స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇవి దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంతో 6–9% అద్దె ఆదాయాన్ని అందిస్తాయి. అంటే.. స్థిరంగా నగదు ప్రవాహం ఉండటంతోపాటు ప్రాపర్టీ విలువ కూడా పెరుగుతుంది.
నాలుగో అడుగు..
ఈ మూడు అడుగుల చక్రాన్ని 7 నుంచి 10 ఏళ్ల కాలంలో 3 నుంచి 4 సార్లు పునరావృతం చేస్తారు. ముందుగానే కొనుగోలు చేయడం, తెలివిగా నిష్క్రమించడం, భావోద్వేగాలను ఈ సమీకరణాలకు దూరంగా ఉంచడం వంటి అంశాలు పెట్టుబడిదారులు సొమ్మును విపరీతంగా పెంచుతాయి. ఇక్కడ చేయాల్సింది పెద్దగా ఏమీ లేదు. మార్కెట్ పరిస్థితులు అంచనా వేయడం, సహనంగా ఉండటం, సరైన ప్రాజెక్టును ఎంచుకోవడం.. ఇవి సరిగా చేస్తే పెట్టుబడులు పంట పండటం ఖాయం.