- దుబాయ్ లో బిచాణా ఎత్తేసిన బ్రోకరేజ్ సంస్థ
- పెద్ద మొత్తంలో సొమ్ము కోల్పోయిన భారతీయులు
దుబాయ్ కు చెందిన ఓ బ్రోకరేజ్ సంస్థ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి, బిచాణా ఎత్తేసింది. ఫలితంగా భారతీయులు సహా చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు. దుబాయ్ బిజినెస్ బే లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ లో గల్ప్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహించేది. అందులో దాదాపు 40 మంది ఉద్యోగులు పని చేసేవారు.
పెట్టుబడిదారులను గుర్తించి సంప్రదించడం, వారి చేత ఫారెక్స్ పెట్టుబడులు ప్రోత్సహించడం ఆ సంస్థ పని. అలా పలువురు భారతీయులు సహా వందలాది మంది నుంచి మిలియన్ల కొద్దీ దీర్హమ్స్ ను వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. అకస్మాత్తుగా సూట్ ఖాళీ చేసి తాళం చెవులు తిరిగి ఇచ్చేశారని ఆ టవర్ సెక్యూరిటీ గార్డు చెప్పాడు. కేరళకు చెందిన మహమ్మద్, ఫయాజ్ పోయల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్యాంకర్స్ ద్వారా 75వేల డాలర్ల పెట్టుబడి పెట్టారు.
తమకు ఫోన్లు చేసి పెట్టుబడి పెట్టాల్సిందిగా ఒప్పించారని వారు వాపోతున్నారు. కేరళకు చెందిన మరో వ్యక్తి ఏకంగా 2.3 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు. మొదట్లో చిన్న లాభాలను చూపించిదని.. తాను కొత్త డబ్బును తీసుకుందామని ప్రయత్నిస్తే.. అది మంచిది కాదని, అలా ఉంచితే మరిన్ని లాభాలు వస్తాయని ఒత్తిడి చేసినట్టు చెప్పారు. గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ క్లయింట్‌లను నియంత్రించని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అయిన సిగ్మా-వన్ క్యాపిటల్ ద్వారా పెట్టుబడి పెట్టమని బలంగా ఒత్తిడి చేసినట్టు మరో భారతీయుడు సంజీవ్ తెలిపారు. కాగా, పోలీసులు ఈ రెండు సంస్థలపై కేసు నమోదు చేశారు.