- చ.గ 750 నుంచి 2 లక్షలకు పెరుగుదల
మణికొండ.. హైదారాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఓ సంచలనం అని చెప్పాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరువాత అంతటి డిమాండ్ ఉన్న ప్రాంతం మణికొండ అని చెప్పడం ఏ మాత్రం అతియోశక్తి కాదు. కేవలం 25 ఏళ్లలో మణికొండ కనీవినీ ఎరుగని రీతిలో మారిపోయింది. ఇంకా చెప్పాలంటే గత పదేళ్లలో మణికొండ రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారాయి. మణికొండలో రియల్ ఎస్టేట్ ప్రారంభమైనప్పుడు వెయ్యి రూపాయలు కూడా పలకని చదరపు గజం ఇప్పుడు లక్షన్నర పైమాటే. ఇక అపార్ట్ మెంట్స్, విల్లాల సంగతి చెప్పక్కర్లేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు ప్రధానమైన ప్రాంతాల్లో మణికొండ ఒకటి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తరువాత అంతటి ప్రముఖమైన నివాస ప్రాంతాల జాబితాలో మణికొండ ఉంటుంది. అయితే 25 ఏళ్ల క్రితం మణికొండకు, ఇప్పటి మణికొండకు పోల్చుకుంటే వెయ్యి రెట్లు మారిపోయింది. ఒకప్పుడు గ్రామంగా ఉన్న మణికొండ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నడిబొడ్డు ప్రాంతం అయిపోయింది.
గ్రేటర్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో మణికొండ హాట్ కేక్ అని చెబుతున్నారు మర్కెట్ రంగవర్గాలు. అవును హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాంతాలతో పోటీపడుతోంది మణికొండ. మరీ ముఖ్యంగా మణికొండ ప్రముఖులకు నివాస ప్రాంతంగా మారిపోయింది. ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నివసించిన.. సినీ, రాజకీయ, వ్యాపారరంగ ప్రముఖులు ఇప్పుడు మణికొండకు నివాసం మార్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సినీ, టీవీ రంగానికి చెందినవారు.. మణికొండలో ఎక్కువగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మణికొండకు డిమాండ్ బాగా పెరిగింది.
మణికొండకు మంచి కనెక్టివిటీ ఉండటం అనుకూలమని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ నుంచి మణికొండకు కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే. అదే ఫిల్మ్ నగర్ నుంచి మణికొండ 5 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక ఐటీ కారిడార్ గచ్చిబౌలి నుంచి మణికొండకు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు. అటు మెహిదీపట్నం నుంచి మణికొండకు 15 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు.
ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్, భారీ షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్స్, స్పోర్స్ట్ అకాడమీలు.. ఇలా కావాల్సినవన్నీ మణికొండలో అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి ప్రతి 15 నిమిషాలకో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అంతేకాదు రాయదుర్గం మెట్రో స్టేషన్ కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు మణికొండ 6 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం. ఇలా మణికొండకు అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉండటంతో ఎక్కడికైనా ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా వెళ్లిపోవచ్చు.
మణికొండలో సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998 లో చదరపు గజం కేవలం 750 రూపాయలు మాత్రమే. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ముప్పాస్.. మణికొండలో పంచవటి కాలనీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ ను డెవలప్ చేసింది. అప్పుడు చదరపు గజం కేవలం 750 రూపాయలు మాత్రమే. ఆ తరువాత క్రమంగా మణికొండలో రియల్టీ ప్రాజెక్టులు క్రమ క్రమంగా మొదలయ్యాయి. మెల్ల మెల్లగా అపార్ట్ మెంట్ ల నిర్మాణం, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది.
మణికొండలో ల్యాంకో హిల్స్ నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అది మొదలు భారీగా అపార్ట్ మెంట్ నిర్మాణాలు మెదలవ్వగా.. విల్లాల నిర్మాణం సైతం ప్రారంభమైంది. ఇప్పుడు మణికొండలో హైరైజ్ అపార్ట్ మెంట్స్ సైతం నిర్మాణం జరుపుకుంటున్నాయి. 25 ఏళ్ల క్రితం చదరపు గజం 750 రూపాయలున్న ధర.. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు అయితే చదరపు గజం 2 లక్షలు, కాస్త లోపలికి ఐతే చదరపు గజం 1.5 లక్షల మేర ధరలు పలుకుతున్నాయి. ఇక పదేళ్ల క్రితం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 2,500 ఉండగా.. ఇప్పుడు చదరపు అడుగు ప్రాజెక్టును బట్టి 7 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ధరలున్నాయి.
ఇక మణికొండలో విల్లాలకు భారీ డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా మణికొండలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా విల్లాల నిర్మాణం చేపడుతున్నాయి. ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణం, సౌకర్యాలను బట్టి ఒక్కో విల్లా 7 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. మరోవైపు మణికొండలో ఇంటి స్థలాలు సైతం అందుబాటులో ఉండటంతో వాటికి మంచి డిమాండ్ ఉంది.
భారీ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్టులతో పాటు స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్ నిర్మాణాలు కూడా అధికంగా ఉండటంతో మధ్య తరగతి వారు సైతం మణికొండలో సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్డుకు కాస్త లోపలికి 80 లక్షల నుంచి కోటి రూపాయలకు కూడా అపార్టుమెంట్ లో ఫ్లాట్స్ లభిస్తున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ వాళ్లు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో మణికొండ మరింత అభివృద్ది చెందనుండటంతో ఇక్కడ ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.