దేశంలో డేటా సెంటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే 2028 నాటికల్లా అదనంగా 3.6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అవసరమని అంచనా. ప్రస్తుతం నిర్మిస్తున్న, ప్రణాళిక దశల్లో ఉన్న 2.32 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు ఇది అదనమని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక పేర్కొంది. 2023 ఆఖరు నాటికి భారత్‌లో కోలొకెషన్ డేటా సెంటర్ల స్థాపిత సామర్ధ్యం 977 మెగావాట్లుగా ఉంది. 2022లో ఇది 126 మెగావాట్లుగా ఉండగా మరుసటి ఏడాది సామర్ధ్యం గణనీయంగా పెరిగింది.
సాటి దేశాలతో పోలిస్తే భారతీయులు అత్యధికంగా ప్రతి నెలా 19 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగంలో భారత్ ఇంకా వెనుకబడే ఉందని నివేదిక తెలిపింది. 2024-2028 మధ్య కాలంలో కొత్తగా 1.03 గిగావాట్ల స్థాయిలో కోలొకేషన్ సామర్థ్యాలు జతవుతున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో మరో 1.29 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో 2028 నాటికి మొత్తం డేటా సెంటర్ సామర్థ్యాలు 3.29 గిగావాట్లకు చేరుతుంది. డిజిటల్, డేటా ఆధారిత సాంకేతికతల వినియోగం దన్నుతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది.
కొత్తగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లలో ప్రధానంగా 90 శాతం హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి కీలక మార్కెట్లలోనే ఉండనున్నాయి. కాగా, డేటా సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ కూడా వేగంగా ఎదుగుతోంది. కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతుండటం కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు దోహదం కానుంది. ‘భారత్‌లో డేటా సెంటర్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతోంది. కోవిడ్ అనంతరం 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఐవోటీ, జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సహా డిజిటల్ వినియోగం పెరగడం ఇందుకు దోహదపడుతోంది. భారత్‌లో 5 నుంచి 6.9 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అవసరం. ఇప్పటికే మొదలుపెట్టినవి, ప్రణాళికల్లో ఉన్నవే కాకుండా అదనంగా 1.7 – 3.6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు కావాలి’ అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫిల్డ్ ఆసియా పసిఫిక్ ఎండీ వివేక్ దహియా తెలిపారు.
This website uses cookies.