తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మూడో సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మూకుమ్మడి దాడి చేస్తూ.. తమ సొంత మీడియాలో బీఆర్ఎస్ అనుకూల కథనాల్ని వండించడంలో అధికార పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రంలో అధిక శాతం మంది బిల్డర్లు అధికార పార్టీయే మళ్లీ గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, కోకాపేట్‌లో ఎకరానికి రూ.100 కోట్లు పలికించిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుంది. బుద్వేల్‌లో సైతం ఎకరానికి సుమారు 41 కోట్ల దాకా పలికింది. పైగా, అనేక దేశవిదేశీ సంస్థలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. అభివృద్ధి మొత్తం నిలిచిపోతుందనే భావనలో నిర్మాణ సంఘాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పైగా, మంత్రి కేటీఆర్ ఆరంభం నుంచీ నిర్మాణ సంఘాలతో సత్సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎలాంటి సమస్యలొచ్చినా మంత్రి కేటీఆర్‌కు చెప్పుకోవచ్చనే భావన కొంతమంది బిల్డర్లలో నెలకొంది. అందుకే, కాంగ్రెస్ బదులు ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్ గెలవాలని మెజార్టీ నిర్మాణ సంఘాలు ముక్తకంఠంతో కోరుకుంటున్నాయి. అందుకే, ఎప్పటిలాగే ఈసారీ రియల్ సంఘాలన్నీ కలిసి ఎన్నికల కోసం రియల్ ఎస్టేట్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాయి. కాకపోతే, గతంలో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. కానీ, ఇప్పుడేమో వేదిక హెచ్ఐసీసీకి మారింది కాబట్టి.. ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబరు 3 దాకా వేచి చూడాల్సిందే.
సీబీఎన్ తప్పే కేటీఆర్ కూడా?
హైదరాబాద్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే కేటీఆర్ చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే, 2004 ఎన్నికల్లో సీబీఎన్ హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్ని మరిచిపోయారు. మంత్రి కేటీఆర్ భాగ్యనగరం మీదే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ.. హైదరాబాద్ గ్రోత్ స్టోరీని ప్రొజెక్ట్ చేయడం మీదే అధిక దృష్టి సారిస్తున్నారు. మొన్న క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో కూడా భాగ్యనగర డెవలప్‌మెంట్ గురించి ప్రకటనల్ని గుప్పించిన విషయం తెలిసిందే. లక్షా ముప్పయ్ వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత హైప్ చేసినా.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు సహజమనే రీతిలో కేటీఆర్ పలు సమావేశాల్లో చేసిన ప్రసంగం చూసి ప్రజలూ విస్తుపోతున్నారని చెబుతున్నారు. దళితబంధు, బీసీ బంధు అంటూ ఆరంభించిన స్కీముల్ని అధిక శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
నిర్మాణసంఘాలు..?
హైదరాబాద్ అభివృద్ధి గురించి ఇటీవల రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలోని కొంతమంది బిల్డర్లు ఆశ్చర్యపోయారు. ఆయనకు భాగ్యనగరం అభివృద్ధికి సంబంధించి అవగాహన ఉందంటూ కితాబునిచ్చారు. అందుకే, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే బిల్డర్లు లేకపోలేదు. అయితే కాంగ్రెస్ అంటే ప్రజలకు ప్రత్యేకమైన ప్రేమ, ఆప్యాయత వంటివి లేవు. అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదీఏమైనా, ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా అధికార పార్టీ తరఫున ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యాయని చెప్పొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ ట్రంప్‌కు మద్ధతు పలికితే ఏమైంది? ఒకవేళ మన రాష్ట్రంలోనూ అలాంటి ఫలితమే పునరావృతమైతే ఎలా? నిర్మాణ సంఘాలన్నీ ఆలోచించాల్సిన అంశమిది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. నిర్మాణ సంఘాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించినప్పుడే హుందాగా ఉంటుంది. సర్వత్రా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.