క్రెడాయ్ హైదరాబాద్ జీఎస్ వి. రాజశేఖర్‌రెడ్డి
- హైదరాబాద్ ఈజ్ ఎవర్‌గ్రీన్
- సౌదీ తర్వాత నగరంలో ఫార్మ్యూలా ఈ రేస్
- ఆకాశహర్మ్యాల నిర్మాణాల్లో వేగం
- పెట్టుబడి నిమిత్తం స్థానికులతో పాటు
ప్రవాసుల కొనుగోళ్లు!
కింగ్ జాన్సన్ కొయ్యడ, హైదరాబాద్ : భవిష్యత్తుపై భరోసా ఉన్న నగరాల్లోకి మాత్రమే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు ముందుకొస్తాయి.. మంత్రి కేటీఆర్ కృషి వల్ల హైదరాబాద్‌పై ఆయా కంపెనీలకు విశ్వాసం పెరిగింది.. హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి సాక్షాత్కరిస్తోంది.. సౌదీ అరేబియా తర్వాత.. భారతదేశంలోనే ప్రప్రథమంగా అంతర్జాతీయ ఈవెంట్ అయిన ఫార్య్మూలా-ఈ రేస్ కు హైదరాబాద్ వేదికగా మారింది.. ప్రపంచ దృష్టిని భాగ్యనగరం ఆకర్షిస్తోంది.. ఇప్పటివరకూ నగరంలోకి అడుగుపెట్టే సంస్థల పెట్టుబడుల ప్రకటనలన్నీ వాస్తవరూపం దాల్చితే.. కనీసం వచ్చే పది, పదిహేనేళ్ల వరకూ నగరాభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వి. రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
2023లో రియల్ స్థితిగతులపై రెజ్ న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ.. సుల్తాన్‌పూర్, చందన్‌వేలీ, ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ వంటి ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి, డెవలపర్లు గిరాకీ పెరిగే చోటను ముందే గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించేందుకు దృష్టి సారించాలని కోరారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పది, పదిహేను సంవత్సరాల క్రితం శివార్లలో తక్కువ రేటుకు ప్లాట్లు కొన్నవారు.. వాటిని విక్రయించి ప్రస్తుతం బడా లగ్జరీ కమ్యూనిటీల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలోనే కొందరు పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరేమో తమ స్వస్థలాలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ప్రాపర్టీలను కొంటున్నారు. ఉదాహరణకు జనగామ, వరంగల్ వంటి ప్రాంతాలకు చెందినవారు ఉప్పల్, పీర్జాదిగూడ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన వ్యక్తులు మేడ్చల్, కొంపల్లిలో ఉండేందుకు ఆసక్తి చూపెడుతున్నారు.
కరీంనగర్, మంచిర్యాల్, సిద్ధిపేట్ వంటి ప్రాంతాలకు చెందిన వారు శామీర్ పేట్, తూముకుంట, అల్వాల్ వంటి ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రవాసులు హై ఎండ్ విల్లాలు, ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు. కాకపోతే, నగరానికి మిడ్ సెగ్మంట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. అవసరానికి అనుగుణంగా వీటిని నిర్మిస్తే అధిక శాతం మధ్యతరగతి ప్రజానీకం సొంతిల్లు కొనేందుకు ముందుకొస్తారు.
* హైదరాబాద్ రియల్ రంగం వెలిగిపోతుందని చెప్పలేం. అలాగనీ, స్థబ్తుగా మారిందని అనలేం. ఎన్నికల సంవత్సరంలో మార్కెట్ ఇలాగే ఉండటం సహజమని మనకు తెలిసిందే. ఇప్పటివరకూ ఫ్లాట్లు అమ్మిన బిల్డర్లు ఇక నుంచి నిర్మాణ పనుల్ని పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. అవసరం ఉన్నవారూ నేటికీ ఇళ్లను కొంటుండటం గమనార్హం. రెండువారాల క్రితం వాసవి సంస్థ ఎల్‌బీనగర్‌లో ప్రాజెక్టును ఆరంభిస్తే.. రెండు రోజుల్లోనే రెండు వందల ఫ్లాట్లను విక్రయించడాన్ని చూశాం. మరోవైపు రెగ్యులర్ మార్కెట్‌తో సంబంధం లేకుండా.. అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాల్లో కొంతమంది బయ్యర్లు ఇళ్లను కొంటున్నారు.
వేగం పెరిగెను..
మైవాన్ టెక్నాలజీ రాకతో ఆకాశహర్మ్యాల నిర్మాణాల్లో వేగం పెరిగింది. కొందరు డెవలపర్లు ఏడెనిమిది రోజుల్లో ఒక్కో ఫ్లోరును వేస్తున్నారు. గతంలో శ్లాబులు వేసి, షట్టరింగ్ తీసి, బ్రిక్ వర్క్ కట్టి, ప్లాస్టరింగ్ చేసి, విద్యుత్తు కనెక్షన్లు, ప్లంబింగ్ లైన్స్ వంటి వాటికోసం అధిక సమయం పట్టేది. కానీ, ఇప్పుడో ఐదారు ఫేజుల్లో అయ్యే పనిని సింగిల్ ఫేజులో చేసేస్తున్నారు. మై హోమ్, అపర్ణా, రాజపుష్ప, ఎస్ఎంఆర్, పౌలోమీ, హాల్‌మార్క్, లాన్సమ్ వంటి సంస్థలు సొంతంగా బాచింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాయి. దీని వల్ల సైటులోనే పని పూర్తవుతుంది. నాణ్యత మెరుగౌతుంది. అవసరమైతే చుట్టుపక్కల సైటుల్లోకి కూడా రెడీమిక్స్‌ను సరఫరా చేస్తున్న కంపెనీలున్నాయి. మొత్తానికి, నగర నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత కూడా పెరిగిందని చెప్పొచ్చు.
రెరా లేకపోతే ప్రశ్నించాలి
ప్లాటింగ్ వెంచర్ అయినా ఆకాశహర్మ్యమైనా.. విల్లా ప్రాజెక్టు అయినా.. ప్రతి అడ్వర్టయిజ్‌మెంట్ పై రెరా నెంబరును తప్పకుండా పేర్కొనాలి. అలా చేస్తేనే ఆయా సంస్థ నిబంధనల మేరకు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుందని చెప్పొచ్చు. రెరా నెంబర్ వేయకుండా వ్యాపార ప్రకటనలు చేయడం కరెక్టు కాదు. కాబట్టి, ప్రతిఒక్క ప్రమోటర్ ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి. కొనుగోలుదారులు ఎప్పుడైనా రెరా ఆమోదిత ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలి. ఎవరైనా ప్రకటనలను విడుదల చేశారంటే.. అందులో రెరా నెంబర్ లేకపోతే.. ఆయా ప్రమోటర్లను బయ్యర్లు ప్రశ్నించాలి. రెరా లేకుండా ఎలా అమ్ముతారని నిలదీయాలి. ఏదో కల్లిబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే ప్రమోటర్లను అస్సలు నమ్మకూడదు.