Categories: LATEST UPDATES

రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను త‌గ్గించాలి

  • ప్ర‌భుత్వాన్ని కోరిన క్రెడాయ్ హైద‌రాబాద్
  • ఎకో టూరిజం డెవ‌ల‌ప్ చేయాలి

నిర్మాణ రంగానికి ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు నెల‌ల పాటు రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను త‌గ్గించాల‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్ రెడ్డి కోరారు. శుక్ర‌వారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆరంభ‌మైన క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెస్టినేష‌న్ హోమ్స్‌, టూరిజం హోమ్స్ డెవ‌ల‌ప్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తు చేశారు. ప్ర‌థానంగా, ట్రిపుల్ వ‌న్ జీవో ఏరియాను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాల‌ని కోరారు.

బిల్డ‌ర్లు అఫ‌ర్డ‌బుల్ మ‌రియు మిడిల్ సెగ్మంట్ మీద దృష్టి పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని.. కాక‌పోతే, ప్ర‌భుత్వ‌మే భూమిని స‌మ‌కూర్చాల‌ని కోరారు. మియాపూర్‌, బాచుప‌ల్లి వంటి ప్రాంతాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాల మాస్ట‌ర్ ప్లాన్‌లో త‌మ సేవ‌ల్ని వినియోగించుకోవాల‌ని కోరారు. క్రెడాయ్ తెలంగాణ అధ్య‌క్షుడు ముర‌ళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్ జీవో ఎత్తివేయ‌డం ఆనందదాయ‌క‌మ‌ని తెలిపారు. అన్ని జిల్లా హెడ్ క్వార్ట‌ర్ల‌కు మాస్ట‌ర్ ప్లాన్ల‌ను రూపొందించాల‌ని కోరారు.

పెరుగుతున్న హైద‌రాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని.. వ‌చ్చే 25- 30 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్యేకంగా మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందించాల‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు రామ‌కృష్ణారావు కోరారు. ట్రిపుల్ జీవో వ‌న్ ప్రాంతంలో ఓ రెండు వేల ఎక‌రాల్లో హైద‌రాబాద్ ప్ర‌త్యేక‌త ప్ర‌తిబింబించేలా అభివృద్ధి చేయాల‌న్నారు. టీఎస్ బీపాస్ గొప్ప‌గా విజ‌య‌వంతం అయ్యిందని.. కాక‌పోతే, అందులో కొన్ని ప్ర‌భుత్వ విభాగాల‌ను అనుసంధానం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎన్విరాన్‌మెంట‌ల్ క్లియ‌రెన్స్ కోసం ఎదుర‌వుతోన్న ఇబ్బందిని తొల‌గించాల‌ని కోరారు. కేర‌ళ త‌ర‌హాలో రాష్ట్రంలో ఎకో టూరిజంను డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావాల‌ని సూచించారు. పెరీ అర్బ‌న్ జోన్ ప్రాంతంలో యాభై శాతం నిర్మాణాలు క‌ట్టేలా అనుమ‌తిని మంజూరు చేయాల‌న్నారు. గ‌త ప‌ది రోజుల్నుంచి నిర్మాణ రంగం స్తంభించింద‌ని.. భ‌వ‌న నిర్మాణ కార్మికులు సైట్ల‌ను వ‌దిలి వెళితే ఇబ్బంది అవుతుంద‌ని.. కాబ‌ట్టి, ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించాలని ప్ర‌భుత్వాన్ని కోరారు.

ఆక‌ట్టుకున్న స్టాళ్లు

క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో అంటేనే బ‌డా బ‌డా స్టాళ్లను ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా డిజైన్ చేస్తారు. గ‌తంలో కంటే ఈసారి స్టాల్స్ లేఅవుట్ వైవిధ్యంగా ఉంది. ఏ స్టాల్‌కు వెళ్లినా.. అక్క‌డే కొంత‌సేపు కూర్చోని ఆయా ప్రాజెక్టుల వివరాలు తెలుసుకునేందుకు ప్రోత్స‌హించేలా ఉన్నాయి. ప్రాప‌ర్టీ షోను విజ‌య‌వంతం చేయ‌డానికి క్రెడాయ్ హైద‌రాబాద్ అన్నిర‌కాల ఏర్పాట్లను ప‌క్కాగా చేసింది.

This website uses cookies.