క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగపడే పలు సెషన్లు జరిగాయి. ఇందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవెందర్ రెడ్డి, హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణలతో జరిగిన ఇంటరాక్షన్ రాష్ట్ర డెవలపర్లను ఆకర్షించింది. తెలంగాణను యూడీఎస్ రహితంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఇందులో పాల్గొన్న జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవెందర్ రెడ్డి పలు అంశాల్ని ప్రత్యేకంగా వివరించారు. టీఎస్ బీపాస్ కింద అపార్టుమెంట్ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే.. తిరస్కరణకు గురవ్వడానికి ప్రధాన కారణమేమిటనే విషయాన్ని విపులంగా విశదీకరించారు. సారాంశం ఆయన మాటల్లనే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకూ టీఎస్ బీపాస్ కింద 4,819 ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేశాం. సింగిల్ విండో కింద క్లియర్ చేసిన 2000 దరఖాస్తుల్లో.. ఒక షాట్ ఫాల్ అయిన తర్వాత సుమారు వెయ్యికి పైగా దరఖాస్తుల్ని ఆమోదించాం. అంటే, యాభై శాతానికి పైగా ఫైళ్లు క్లియర్ అయ్యాయన్నమాట. ఎలాంటి షాట్ ఫాల్ లేకుండా ఆమోదించిన దరఖాస్తులు దాదాపు 850 దాకా ఉన్నాయి. ఈ శాతం ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో 80 నుంచి 90 శాతానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. అసలీ షాట్ ఫాల్ ఎందుకు తలెత్తుతుందనే విషయం చాలామందికి కొన్ని సార్లు అర్థం కాకపోవచ్చు. నిజానికి, డీసీఆర్లో డ్రాయింగ్ క్లియర్‌గా ఉంటే, 90 శాతం సమస్య ఉండనే ఉండదు.
కొన్నిసార్లు సైట్ కండీషన్ కరెక్టుగా నమోదు చేయకపోతే షాట్ ఫాల్ ఏర్పడుతుంది. రోడ్డు వెడల్పు సరిగ్గా పేర్కొనకపోయినా.. ప్లాట్ డైమెన్షన్ సరిగ్గా కొలవకపోయినా ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే, ప్లాటు కొలతలు, డ్రాయింగ్ మధ్య తేడా ఉంటేనే ఇబ్బంది వస్తుందనే విషయం ప్రతిఒక్కరూ గుర్తించాలి.
కొన్ని సందర్భాల్లో ప్లాటు టైటిల్ విషయంలో అవరోధం తలెత్తుతుంది. ఆయా ప్లాటు యూఎల్సీ సర్ ప్లస్ కింద ఉన్నా.. రెవెన్యూలో ఉన్నా కష్టమే. ప్లాటు టైటిల్ కి సంబంధించి పూర్తి క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. అందుకు సంబంధించి డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అనేక సందర్భాల్లో బిల్డర్లు ఈ పనిని ఆర్కిటెక్టుకు అప్పచెబుతారు. వాళ్లు సరిగ్గా డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
మాస్టర్ ప్లాన్ ప్రకారం బిల్డర్లు ప్రణాళికల్ని రచించాల్సి ఉంటుంది. ఏదైనా రోడ్డు కానీ ల్యాండ్ యూజ్ కానీ ఎఫెక్టు అవుతుందా అనే విషయాన్ని తెలుసుకుని.. అనుమతికి దరఖాస్తు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బిల్డర్లు భవనాల అనుమతి కోసం దరఖాస్తు చేసేటప్పుడే ఎనిమిది అంశాలతో కూడుకున్న చెక్ లిస్టును చూసుకుంటే సరిపోతుంది. అది నింపితే చాలు.. ఎవరికి వారే స్వీయ ధృవీకరణ చేసుకోవచ్చు. అప్పుడే షాట్ ఫాల్ కూడా తెలిసిపోతుంది. సెకండ్ షాట్ ఫాల్ అనేది ప్రస్తుతం సిస్టమ్ లో లేదు. ఎలాంటి షాట్ ఫాల్ లేకుండానే 80 నుంచి 90 శాతం అనుమతులకు ఆమోదం తెలపాలన్నదే జీహెచ్ఎంసీ తాపత్రయం.
టీఎస్ బీపాస్ కింద 21 రోజుల్లో అనుమతుల్ని మంజూరు చేయాలి. అన్ని ప్రభుత్వ విభాగాల్ని దీనికి అనుసంధానం చేయాలి. అయితే రెవెన్యూ విభాగంలో కొన్ని సమస్యలు ఏర్పడటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫైర్, ఇర్రిగేషన్ వంటి ఇతర విభాగాలు ఇప్పటికే వేగంగా స్పందిస్తున్నాయి. మొత్తానికి, టీఎస్ బీపాస్ పని చేయడానికి ఎంత లేదన్నా మరో మూడు నెలల దాకా పడుతుంది. ప్రస్తుతం అయితే పాత డీపీఎంస్ విధానంలోనే దరఖాస్తులు తీసుకుంటారు. మార్చిలోపు పూర్తి చేసి.. ఆతర్వాత టీఎస్ బీపాస్ కిందే అనుమతుల్ని మంజూరు చేస్తాం. టీడీఆర్‌లను ప్రతిఒక్క బిల్డర్ తప్పకుండా వినియోగించుకోవాలి. లేకపోతే, కొత్త లింక్ రోడ్లను ఏర్పాటు చేయడం ఆలస్యమవుతుంది.