గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొంతమంది రియల్టర్లపై ఐటీ దృష్టి సారించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా వారి కుటుంబ సభ్యులతో సంబంధాలున్నాయని భావిస్తున్న రియల్టర్ల ఆఫీసులు, నివాసాల్లో తనిఖీలు నిర్వహించింది. ఆయా సంస్థలు, కంపెనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా వారి కుటుంబ సభ్యులకు వ్యాపారపరమైన లావాదేవీలు ఉన్నాయని తెలియడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా గూగీ ప్రాపర్టీస్ సహా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు జరిపారు. దిల్ సుఖ్ నగర్, కొత్తపేటల్లోని గూగీ ప్రాపర్టీస్ తోపాటు ఆ కంపెనీకి చెందిన ఆదిభట్లలోని వండర్ సిటీ, మంగళ్ పల్లిలోని రాయల్ సిటీ, ఆదిభట్ల సమీపంలోని డాలర్ సిటీ, యాచారంలోని ఫార్మాసిటీ, యాదాద్రి సమీపంలోని పెరల్ సిటీ కార్యాలయాలతోపాటు హవర్స్, విహంగా ఇన్ ఫ్రా, గూగీ రియల్ ఎస్టేట్ కు చెందిన అనుబంధ కంపెనీల్లోనూ తనిఖీలు చేశారు. కంపెనీల ఆఫీసులతో పాటు గూగీ ప్రాపర్టీస్ ఎండీ, సీఈఓ షేక్ అక్బర్ తోపాటు ఇతర డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది.
భూములు ధరలు ఎక్కువగా ఉన్న, భారీ హౌసింగ్, కమర్షియల్ వెంచర్లు వస్తున్న ఏరియాల్లోని రియల్టీ కంపెనీలపైనే ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీ నగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. రియల్టీ కంపెనీలు పొందిన భూములు కొందరు అధికార పార్టీ నేతలు, వారి సన్నిహితుల ఆధీనంలో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రియల్టర్లు, రాజకీయ నేతల మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పన్నుల ఎగవేత ఏమైనా జరిగిందా అనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా కొన్ని రియల్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
This website uses cookies.