Categories: LATEST UPDATES

భారత రియల్ రంగం.. పారదర్శకం

పారదర్శక రియల్ మార్కెట్ దేశాల జాబితాలోకి ఇండియా

31వ ర్యాంకు పొందినట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడి

భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ పారదర్శక దేశాల జాబితాలో చేరింది. ముఖ్యంగా దేశంలోని టైర్-1 మార్కెట్లు తొలిసారిగా ఈ ఘనత సాధించాయి. సంస్థాగత భాగస్వామ్యం పెరగడం, పారదర్శకత పెంపొందించే దిశగా ఉత్తమ చర్యలు చేపట్టడం వంటి అంశాలు భారత రియల్ మార్కెట్ ను పారదర్శక మార్కెట్ల జాబితాలో చేరడానికి దోహదపడ్డాయని జేఎల్ఎల్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్ పరెన్సీ ఇండెక్స్ వెల్లడించింది. ఈ సూచీ ప్రకారం భారత్ 2.44 స్కోర్ తో 31వ ర్యాంకు సాధించింది. 1.24 స్కోర్ తో యూకే, 1.26 స్కోర్ తో ఫ్రాన్స్ టాప్ లో నిలిచాయి.

ఇందులో టాప్ లో ఉన్న 13 దేశాలను అత్యంత పారదర్శక మార్కెట్ కలిగినవాటిగా పరిగణిస్తారు. 14 నుంచి 35వ స్థానంలో ఉన్న దేశాలను పారదర్శక మార్కెట్ కలిగినవాటిగా పరిగణిస్తారు. 36 నుంచి 50వ ర్యాంకు పొందినవాటిని సెమీ ట్రాన్స్ పరెంట్ దేశాలుగా భావిస్తారు. చురుకైన ఆర్థిక నియంత్రణ, క్రమబద్ధీకరించిన భవన నిబంధనలు, డిజిటలైజ్డ్ భూ రికార్డులు వంటి అంశాలు మన దేశాన్ని పారదర్శక దేశాల జాబితాలోకి తీసుకెళ్లడానికి దోహదం చేశాయి. ప్రతి రెండేళ్లకోసారి ఆయా అంశాల ప్రాతిపదికన ఈ సూచీ విడుదల చేస్తారు. 2022లో విడుదల చేసిన ఈ సూచీలో భారత్ సెమీ ట్రాన్స్ పరెంట్ కింద 36వ ర్యాంకులో ఉంది. తాజాగా ఆ ర్యాంకును మెరుగుపరుచుకుని 31వ స్థానానికి వచ్చింది. లావాదేవీ ప్రక్రియ పారామీటర్ లో ఆసియా నుంచి భారత్ ఒక్కటే టాప్ టెన్ లో నిలవడం విశేషం.

సింగిల్ ఓనర్ షిప్ అసెట్స్, ఆఫీస్ లీజింగ్, సంస్థాగత లావాదేవీ ప్రక్రియ, రెరా వంటి రెగ్యులేటరీ మార్పులు భారత్ ను ఇందులో టాప్ లో నిలిపాయి. ‘భారతదేశ ఆఫీస్ రీట్ మార్కెట్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ లో 12 శాతం కలిగి ఉండటంతోపాటు రెరా, దివాలా కోడ్ వంటి అంశాలు పెట్టుబడిదారుల రక్షణను మరింత మెరుగుపరిచాయి. అలాగే డిజిటల్ ల్యాండ్ రిజిస్ట్రీ రికార్డులు, ఆర్బీఐ, సెబీ కఠినమైన నియంత్రణ విధానాలు చక్కని వాతావరణాన్ని సృష్టించాయి’ అని జేఎల్ఎల్ చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ పేర్కొన్నారు.

This website uses cookies.