Categories: LATEST UPDATES

జూన్ 1 నుంచి జగనన్న కాలనీలు

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు.. జూన్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో జగనన్న కాలనీల నిర్మాణాల్ని ఆరంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గల వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్లలో సుమారు 28.30 లక్షల ఇళ్లను రెండు విడతలుగా నిర్మిస్తారు. వీటి నిర్మాణ పనులకు అవసరమయ్యే గ్రౌండ్ వర్కును మే 25కల్లా పూర్తి చేయాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఈ నిర్మాణ పనులకు కొవిడ్ వల్ల ఆటంకం కలగకూడదని, ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 దాకా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆర్థిక పురోగతి సాధ్యం..

కరోనా నేపథ్యంలో ఈ ఇళ్లను కట్టడం వల్ల స్టీలు, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రిని కొనేందుకు వీలు పడుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని, ఫలితంగా ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని వివరించారు. జూన్ లో నిర్మాణాలు ఆరంభమైతే, సెప్టెంబరులోపు పునాదులు పూర్తవుతాయని, గోడల నిర్మాణం డిసెంబరుకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మొత్తానికి, 2022 జూన్ లోపు ఈ ఇళ్లన్నీ పూర్తవుతాయని వెల్లడించారు.

This website uses cookies.