మన వద్ద మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉండటం.. నిపుణుల డాక్టర్ల సేవలు లభించడం.. వంటి అంశాల వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది భాగ్యనగరం వైపు ఆసక్తి చూపిస్తున్నారని.. అందులో కొందరైతే ఇక్కడే సొంతింటిని కొంటున్నారని వాసవి గ్రూప్ సీఎండీ ఎర్రం విజయ్ కుమార్ తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ సందర్భంగా ఆయన ‘’రియల్ ఎస్టేట్ గురు’’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల రియల్ రంగంలో అమ్మకాలు తాత్కాలికంగా తగ్గుతుంది తప్ప, దీర్ఘకాలికంగా మనకొచ్చే నష్టమేం ఉండదనే భరోసాను కల్పిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ మన మార్కెట్ పుంజుకుంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘‘ కొవిడ్ కంటే ముందు అయినా, తర్వాత అయినా ప్రతిఒక్కరికీ ఒక గూడు కావాలి. కాబట్టి, కొనగలిగే స్థోమత ఉన్న ప్రతిఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇల్లు కొనుక్కోవాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంటి కొనుగోలు ఎంత ఆలస్యం చేస్తే.. అంత భారమయ్యే ప్రమాదం ఉంటుంది. కొందరేం చేస్తుంటారంటే ఏదో ఒక వంకతో ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తుంటారు. కాకపోతే, వారు చూస్తుంటేనే ఇంటి ధర పెరిగిపోతూ ఉంటుంది. ఒక నిర్మాణం ఆరంభయ్యేటప్పుడు ఉండే రేటు గృహప్రవేశం సమయంలో ఉండదు కదా.. కాబట్టి, ఈ అంశాన్ని అర్థం చేసుకుని సొంతిల్లు కొనుక్కోవడం ఉత్తమమే.
గతేడాదిలో కొవిడ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మనలో చాలామందికి అర్థం కాలేదు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత, అంటే జులై నుంచి మార్చి దాకా అమ్మకాలు రెండింతులు పెరిగాయి. ఎందుకంటే, కొవిడ్ వల్ల ప్రజల ఆలోచనలు సొంతింటి వైపు మళ్లాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా మారడమో ప్రధాన కారణమని చెప్పొచ్చు. హైదరాబాద్ నాలుగు వైపులా అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమిదే. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడ ధరలు తక్కువ ఉండటంతో పాటు నగరం మెడికల్ హబ్ గా మారింది. ఈ ఒక్క కారణం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందినవారు మన వద్ద స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మా వద్ద అయితే, గతేడాది నుంచి నిన్నటి మార్చి వరకూ జార్ఖండ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందిన అనేక మంది సొంతింటిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా, హైదరాబాద్ కు చేరువగా ఉన్న కొన్ని మహారాష్ట్ర పట్టణాల్లో ఆస్పత్రుల్లేవు.. బెడ్లు లేవు.. ఆక్సిజన్ లేదు.. వంటి అనేక కారణాల వల్ల వీరంతా హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నారు. కొవిడ్ తో పాటు ఇతర చికిత్సల నిమిత్తం నగరానికొస్తున్నారు. వీరిలో కొందరు ఇక్కడే స్థిరపడుతున్నారు.
కొవిడ్ వల్ల ఆఫీసు సముదాయాన్ని కొనుగోలు చేసే అత్యంత సంపన్నులతో బాటు పెట్టుబడి పెట్టే సంస్థల ఆలోచనలూ మారిపోయాయి. గతంలో వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని కొనేవారు.. కరోనా వల్ల రెండు వేల చదరపు అడుగుల స్థలాన్ని కొంటున్నారు. ఆఫీసుల్లో కూడా భౌతిక దూరం పాటించాలనే నిబంధనను పలు కంపెనీలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. పదివేల చదరపు అడుగుల స్థానంలో ఇరవై వేల చ.అ. స్థలాన్ని కొంటున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, గచ్చిబౌలిలో నిర్మిస్తున్న మా రెండు ఆఫీసు సముదాయాల్లో పలు కంపెనీలు అధిక స్థలాన్ని ఎంచుకున్నాయి. మొదటి లాక్ డౌన్ తర్వాత 2021 మార్చి దాకా సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని విక్రయించాం.
హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సరిగ్గా ఇరవై ఆరేళ్లు అవుతోంది. ఇప్పటివరకూ దాదాపు యాభై ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఎంతలేదన్నా రెండు మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరం నలువైపులా.. పది ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. దాదాపు ఐదు మిలియన్ చదరపు అడుగుల స్థలంలో.. పది వేల ఫ్లాట్లు వస్తాయి. ఐదు మిలియన్ చదరపు అడుగుల్లో రెండు కమర్షియల్ ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తున్నాం. ఇవి కాకుండా, తూముకుంట, శామీర్ పేట్, సదాశివపేట్లలో మరో మూడు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లను వేశాం. మొత్తం కలిపి దాదాపు మూడు వందల ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నాం.
లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించే అవకాశమున్నది. ఇప్పటికే మా ప్రాజెక్టుల్ని చూసినవారు.. మా సిబ్బందితో కలిసి డిస్కస్ చేసినవారు.. ఆన్ లైన్ లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. వీరికోసం మా సిబ్బంది అందుబాటులో ఉంటుంది. కాకపోతే, కొందరేమో.. అత్యవసరాల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో.. పది, పదిహేను లక్షల దాకా సొమ్మును దాచి పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో అధిక శాతం.. ఇప్పుడైనా ఒకట్రెండు నెలలైన తర్వాతనైనా ఫ్లాట్లను తప్పకుండా కొంటారు. గత వారం రోజుల్నుంచి అయితే హైదరాబాద్లో బయ్యర్లు తగ్గారు. కాకపోతే, కొంతకాలం అయ్యాక మళ్లీ సొంతింటిని కొనడం ఆరంభిస్తారు. కాబట్టి, మన రియల్ మార్కెట్ కు వచ్చే ఢోకా ఏమీ ఉండదు. ’’
This website uses cookies.