జనప్రియ ఇంజినీర్స్ సీఎండీ కే. రవీందర్‌రెడ్డి
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ వంటిదని.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఏ ప్రభుత్వమైనా.. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని జనప్రియ ఇంజినీర్స్ ఛైర్మన్ కె.రవీందర్‌రెడ్డి తెలిపారు. 2023 ఎన్నికల నేపథ్యంలో ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సిటీ వృద్ధి చెందడానికి బౌగోళికపరమైన అడ్డంకుల్లేకపోవడం కలిసొచ్చే అంశమన్నారు. ఇక్కడి వాతావరణం, కల్చర్, మౌలిక సదుపాయాలు వంటివి ప్రతిఒక్కరికీ విశేషంగా నచ్చుతాయన్నారు. అందుకే, అధిక శాతం మంది ప్రజలు హైదరాబాద్‌లో నివసించేందుకు దృష్టి సారిస్తారని తెలిపారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలుంటే.. అందులో కోటీన్నర మంది వరకూ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లోనే నివసిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణలోని పలు ఏరియాల నుంచి నగరానికి వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నగరంలో విద్య, వైద్యం, ఐటీ, ఆర్థిక రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఫలితంగా ఇళ్లను కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మొత్తానికి, హైదరాబాద్ ద్వారా లభించే ఆదాయం రాష్గ్రమంతటా వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది. ఎంత రాబడి పెరిగితే అంత శాతం సొమ్మును ఇతర అవసరాల నిమిత్తం ఖర్చు చేయడానికి వీలు కలుగుతుంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే ఏ ప్రభుత్వమైనా హైదరాబాద్ అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది.
మన ప్రత్యేకత ఇదే!
హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిది. ఇక్కడ్నుంచి నుంచి సుమారు వంద, నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేందుకు వీలుంది. అదే, దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇలాంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే, చెన్నైని తీసుకుంటే ఒకవైపు సముద్రం ఉంది. మరోవైపు 30 కిలోమీటర్ల దూరంలోనే ఏపీ బోర్డర్ వస్తుంది. బెంగళూరును తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ యాభై కిలోమీటర్లలోపు ఉంటుంది. ముంబైలో ఒకవైపు సముద్రం, ఢిల్లీ విషయానికొస్తే.. హైదరాబాద్ కంటే కొంత పెద్దగా ఉంటుందనుకుందాం.. అందుకే, అక్కడ నొయిడా, గుర్గావ్ వంటివి డెవలప్ అవుతున్నాయి. మన నగరంలో హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం కోటీన్నర ప్రజలున్నారు కాబట్టి.. ఇక్కడి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మిగతా అరవై శాతం ప్రజలకు ఖర్చు చేయడానికి వీలుంది. ఎంత రాబడి పెరిగితే అంత సొమ్మును ప్రజల కోసం వినియోగించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సిందే.