Categories: LATEST UPDATES

రెజ్ న్యూస్ ఆనాడే చెప్పింది బుద్వేల్‌లో భూముల వేలం!

  • మెట్రో రైలు ప్రారంభోత్సవంలోనే చెప్పిన రెజ్ న్యూస్
  • బుద్వేల్‌లో ఫస్ట్ ఫేజ్ 182 ఎక‌రాల వేలం
  • తొలుత 60 ఎక‌రాలు విక్ర‌యానికి ప్లాన్
  • ఎక‌రం రూ. 30-35 కోట్లు ప‌లికే అవ‌కాశం

రాయ‌దుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్ మెట్రో రైలుకు శంకుస్థాప‌న చేసిన‌ప్పుడే.. బుద్వేల్‌లో ప్ర‌భుత్వం భారీ స్థాయిలో భూముల్ని విక్రయించడానికి ప్రణాళికలు రచిస్తోందని.. వేలం పాట‌ల నిర్వహణ ద్వారా కోట్ల రూపాయల్ని సమీకరించే ప్రయత్నం చేస్తుందని రియ‌ల్ ఎస్టేట్ గురు మొదట్లోనే చెప్పింది. వెయ్యి ఎకరాల వేలం.. 40 వేల కోట్ల సమీకరణే లక్ష్యం కథనాన్ని గత డిసెంబరులో ప్రచురించింది. అక్కడి చెరువును చూపెట్టి భూముల్ని మార్కెటింగ్ చేయనున్నదని కథనంలో పేర్కొన్నట్లుగానే.. ఈ వెంచర్ కు హెచ్ఎండీఏ లేక్ సిటీ అని నామ‌క‌ర‌ణం చేసింది.

హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ ప్రణాళికల గురించి ప్ర‌ప్ర‌థ‌మంగా.. సాగ‌ర తీరంలో స‌రికొత్త అభివృద్ధి అనే శీర్షిక‌తో ఫిబ్రవరి 25న ప్రత్యేక కథనాన్ని రియ‌ల్ ఎస్టేట్ గురు పాఠ‌కుల ముందు ఉంచింది. రెజ్ న్యూస్ చెప్పిన‌ట్లే.. హెచ్ఎండీఏ బుద్వేల్‌లో ప్రభుత్వం భూముల విక్ర‌యానికి శ్రీకారం చుట్టింది. తొలుత 182 ఎక‌రాల్ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తారని హెచ్ఎండీఏ చెబుతోంది. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 6.13 నుంచి 14.58 ఎక‌రాల దాకా ఉంటుంది. మొత్తం క‌లిపితే 60.08 ఎక‌రాలు అవుతోంది. ఈ క్రమంలో తొలుత ఏడు ప్లాట్ల‌ను విక్ర‌యించ‌డానికి రంగం సిద్ధం చేసింది. 283/పి, 284/పి, 287/పి, 288/పి, 289, 290, 291, 292, 293, 294, 205, 296, 297, 298, 299/పి స‌ర్వే నెంబ‌ర్ల‌లో ఈ భూమి ఉంది.

ఈ లేఅవుట్లో మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేయ‌డానికే ప్ర‌భుత్వం సుమారు రూ.200 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇందుకోసం ఎంత‌లేదన్నా 18 నెల‌లు ప‌డుతుంది. ఈ లేఅవుట్‌ని అత్యంత ఆధునిక రీతిలో డెవ‌ల‌ప్ చేసేందుకు హెచ్ఎండీఏ అడుగులు ముందుకేస్తోంది. కార్పొరేట్ సంస్థ‌ల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌కు అన్నిర‌కాలుగా అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు స‌న్నాహాలు చేస్తోంది
హైద‌రాబాద్‌లో తొలుత హైటెక్ సిటీ డెవ‌ల‌ప్ అయ్యింది. త‌ర్వాత గ‌చ్చిబౌలి, నాలెడ్జి సిటీ, కోకాపేట్‌లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడా జాబితాలోకి రాజేంద్ర‌న‌గ‌ర్ చేర‌నుంది. హెచ్ఎండీఏ లేక్ సిటీ నుంచి కిస్మ‌త్ పూర్ కూత‌వేటు దూరంలో ఉంటుంది. ఇక్క‌డ్నుంచి ఐదు నిమిషాల్లో ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదికి చేరుకుంటే చాలు.. న‌గ‌రంలోని ఏ ప్రాంతానికైనా సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు
రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని బుద్వేల్‌లో అభివృద్ధి చేస్తున్న ఈ లేక్ సిటీని మ‌ల్టీపుల్ యూజ్ జోన్‌గా ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా ఆఫీసు స‌ముదాయాలు, రెసిడెన్షియ‌ల్‌, రిటైల్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హెల్త్‌కేర్ వంటివి ఇక్క‌డ అభివృద్ధి చెంద‌డానికి ఆస్కారముంది. ఇందులో వేలం ద్వారా ప్లాట్ల‌ను కొనుగోలు చేసేవారికి మూడు వారాల్లో నిర్మాణాల‌కు కావాల్సిన అనుమ‌తుల‌న్నీ మంజూరు చేస్తారు. ప్లాటు విస్తీర్ణం.. దాని ప‌క్క‌నే గ‌ల రోడ్డు వెడ‌ల్పును బ‌ట్టి ఎంత ఎత్తులోనైనా నిర్మాణాల్ని నిర్మించేందుకు సౌలభ్యముంది. ఇందులో 36 మీట‌ర్ల వెడల్పులో ఇంట‌ర్న‌ల్ రోడ్ల‌ను డెవ‌ల‌ప్ చేస్తారు. మ‌రి, వేలం పాట‌ల తేదీని ఎప్పుడు నిర్వ‌హిస్తార‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త రావాల్సిన అవ‌స‌ర‌ముంది. ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం ఈడీ లిక్క‌ర్ స్కాం అంశంలో బిజీగా ఉన్నందు వ‌ల్ల‌.. ఆ స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత‌.. వేలం తేదిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. కాక‌పోతే, ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో ఇలాంటి వేలాన్ని నిర్వ‌హిస్తే ఎంత‌మంది భారీ విస్తీర్ణంలో గల ప్లాట్లు కొనుక్కోవ‌డానికి ముందుకొస్తారో తెలియాలంటే కొంత‌కాలం వేచి చూస్తే స‌రిపోతుంది

This website uses cookies.