హైదరాబాద్ లో నవంబర్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 6,119 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయినట్టు నైట్ ప్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. నెలవారీగా చూస్తే ఇది 32 శాతం పెరుగుదల అని వివరించింది. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.2,892 కోట్లు అని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హైదరాబాద్ లో 62,159 రెసిడెన్షియల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి విలువ రూ.30,415 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.33,531 కోట్ల విలువైన 75,453 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక గతనెల విషయానికి వస్తే మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 50 శాతం ఉన్నాయి. గతేడాది నవంబర్ తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. గతేడాది నవంబర్లో ఇది 37 శాతంగా నమోదైంది.
ఇక రూ.25 లక్షల కంటే తక్కువ విలువ కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు గతేడాది నవంబర్లో 39 శాతం నమోదు కాగా, ఈ ఏడాది 22 శాతానికి తగ్గింది. అలాగే రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 24 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు గతేడాది నవంబర్ లో 15 శాతం ఉండగా.. ఈ ఏడాది నవంబర్లో అది 22 శాతానికి పెరిగింది. వెయ్యి చదరపు అడుగల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు 74 శాతం నుంచి 65 శాతానికి తగ్గాయి. జిల్లాలవారీగా చూస్తే మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో ఇళ్ల విక్రయాల రిజిస్ట్రేషన్లు 41 శాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 39 శాతం, హైదరాబాద్ జిల్లాలో 14 శాతంగా నమోదయ్యాయి. ఇక నివాస ప్రాపర్టీల ధరలు వార్షిక ప్రకారం చూస్తే గతనెలలో 12 శాతం పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 47 శాతం పెరుగుదల నమోదైంది.