-
2023లో మార్కెట్ వృద్ధిలోకి
-
2022లో స్థిరత్వంగా సాగిన రియల్ రంగం
-
నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు బి.సునీల్ చంద్రారెడ్డి
నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ.. 2022లో హైదరాబాద్ నిర్మాణ రంగం తన ప్రాభవాన్ని చాటుకున్నదని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. 2022లో మార్కెట్ స్థితిగతులు, కొత్త ఏడాదిలో రియల్ రంగం పయనంపై ఆయన అంచనాల్ని రెజ్ న్యూస్‌కి ప్రత్యేకంగా వివరించారు. మార్కెట్ కాస్త ఊపందుకోవడానికి అప్పర్ సెగ్మెంట్లు ప్రభావం చూపించాయని అభిప్రాయపడ్డారు. రూ.కోటి లేదా అంతకుమించి విలువ కలిగిన ఫ్లాట్ల విక్రయాలు ఊపందుకున్నాయని తెలిపారు. నెలవారీగా చూస్తే హైదరాబాద్ మార్కెట్ 28 శాతం పెరిగి, నవంబర్ లో రూ. 2,891 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో సునీల్ చంద్రారెడ్డి మాటల్లోనే..
‘భౌగోళిక రాజకీయ పరిణామాలతోపాటు గృహ రుణాల రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం ఎక్కువ కావడం వంటి అంశాలు ఉన్నప్పటికీ నగరాల్లో రెసిడెన్షియల్ మార్కెట్ ఆశావహంగానే కనిపించింది. ఇక ఐటీ కంపెనీలు 2022లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయి. ఆఫీసుకు రావడం వంటి విధానాలు అమలు చేయడంతో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరిగింది. 2023లో ఉద్యోగాల పెరుగుదలతో పాటు వాణిజ్య కార్యకలాపాలు, ఆదాయం కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇవన్నీ సహజంగానే గృహ డిమాండ్ కు కారణమవుతాయి. అద్దె అపార్టుమెంట్ల కంటే సొంత ఇళ్లనే ఇష్టపడే యువతతో పాటు కోవిడ్ కారణంగా ఇళ్ల నవీకరణ అవసరాన్ని అందరూ గుర్తించారు. ఈ నేపథ్యంలో 2023 వృద్ధి చెందే డైనమిక్ మార్కెట్ ను చూడనున్నది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అనుకూల విధాన నిర్ణయాలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫార్మా, డేటా సెంటర్లు, మానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్ డీ విభాగాల్లో గత కొన్నేళ్లుగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది.